లండన్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు
మూడు గంటలపాటు అలరించనున్న ఓపెనింగ్ సెర్మనీ
స్పెషల్ ఎట్రాక్షన్‌గా డానీ బోయెల్ ఈవెంట్
ముస్తాబైన ఒలింపిక్స్ పార్క్ స్టేడియం
లండన్, జూలై 25: ఒలింపిక్స్ అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది ప్రారంభోత్సవ వేడుకలే.. ఎప్పటికప్పుడు నూతనంగా అభిమానులను అలరించడమే దీనికి కారణం. గేమ్స్‌లో సరికొత్త రికార్డులు బద్దలైనా.. అందరూ ప్రత్యేకంగా చూసేది మాత్రం ప్రారంభ, ముగింపువేడుకలనే అనడంలో ఎటువంటి సందేహంలేదు. దీంతో ప్రపంచ క్రీడాసంబరానికి అతిథ్యమిచ్చే దేశాలు ఓపెనింగ్ భారీ ఎత్తున నిర్వహించడంపైనే దృష్టిపెడతాయి. గత బీజీంగ్ ఒలింపిక్స్ ఆరంభవేడుకలను అభిమానులు ఇప్పటికీ మరచిపోలేదంటే కారణం. భారత కాలమాన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరగనున్న ఓపెనింగ్ సెర్మనీ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఆరంభవేడుకలలో ప్రముఖ హాలీవుడ్ డైరక్టర్ డానీ బోయెల్ ఈవెంట్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్లాన్స్‌ను కూడా ఆయన ప్రకటించారు. బ్రిటీష్ కల్చర్ ఉట్టిపడేవిధంగా రూపొందించిన ప్లాన్‌తో లండన్ ఒలింపిక్స్‌కు స్వాగతం పలకనున్నారు. దీనితోపాటు మరికొన్ని ప్రత్యేకమైన ఈవెంట్స్ అభిమానులకు కనువిందు చేయనున్నాయి. సమయాభావం, సెక్యూరిటీ వంటి కారణాలతో ఓపెనింగ్ సెర్మనీని నిర్వాహకులు కుదించారు. డానీ బోయెల్ ఈవెంట్ తర్వాత సాంప్రదాయ రీతిలో అన్ని దేశాల క్రీడాకారుల మార్చ్‌ఫాస్ట్ ఉంటుంది. అనంతరం ఊరేగింపుగా వచ్చిన ఒలింపిక్ జ్యోతిని నిర్వాహకులలో ఒకరు అందుకుంటారు. తర్వాత ఆటగాళ్ళచే ప్రతిజ్ఞ, బ్రిటన్ రాజకుటుంబీకుల ప్రసంగంతోపాటు ఐవోఎ తరపున ప్రెసిడెంట్ ఇంకా.. పలువురు ప్రముఖుల ప్రసంగాలుంటాయి. అయితే ఈ వేడుకలకు సంబంధించిన మరింత సమాచారాన్ని సస్పెన్స్‌గా ఉంచారు. ప్రారంభ, ముగింపు వేడుకలలో దాదాపు 15వేల మంది కళాకారులు పాల్గొంటారని అంచనా. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా అతిరథమహారథులు హాజరుకానున్న లండన్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని నిర్వాహకులు ధీమాగా ఉన్నారు. వారి అంచనాల ప్రకారం ఈ వేడుకలను ప్రత్యక్షంగా 80వేల మంది, టీవీల ద్వారా బిలియన్ల అభిమానులు వీక్షిస్తారని తెలుస్తోంది.