లక్షమందితో యోగాసనాలులక్షమందితో యోగాసనాలు

రాందేవ్‌ బాబా ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు నమోదు
రాజస్థాన్‌లోని కోటా నగరంలో అరుదైన ఘటన
పాల్గొన్న రాజస్థాన్‌ సీఎం వసుందర రాజే, మంత్రులు
కోటా, జూన్‌21(జ‌నం సాక్షి) : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. రాజస్థాన్‌లోని కోటా నగరంలో లక్ష మందికి పైగా ఒక్కచోట చేరి యోగాసనాలు వేసి రికార్డు సాధించారు. రాందేవ్‌ బాబా నిర్వహించిన ఈ యోగా కార్యక్రమానికి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. స్థానిక ప్రజలు ఇందులో పాల్గొని యోగా చేశారు. గిన్నిస్‌ బుక్‌ నుంచి ఇద్దరు ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై పర్యవేక్షించారు. యోగాసనాలు వేయడం పూర్తయిన తర్వాత గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు ప్రపంచ రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. రాజస్థాన్‌ ప్రభుత్వం, పతంజలి యోగ్‌పీఠ్‌, కోటా జిల్లా యంత్రాంగం కలిసి ప్రపంచంలో అత్యధిక మందితో యోగా కార్యక్రమం చేపట్టారని ఆ ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్నారు. కోటాలోని ఆర్‌ఏసీ మైదానంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మొత్తం 1.5లక్షల మందికి పైగా ఒకేచోట యోగాసనాలు చేసినట్లు తెలిపారు. కాగా మైదానంలో దాదాపు 2లక్షల మంది ఉంటారని అంచనా. లక్ష మందికి పైగా లెక్కించిన అనంతరం ధ్రువీకరణ పత్రం ఇచ్చేశారు. కౌంటింగ్‌ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. అంతకుముందు ఈ రికార్డు 2017లో మైసూర్‌లో 55,524మందితో యోగాసనాలు చేసిన కార్యక్రమం పేరిట ఉంది.