లక్షల ఎకరాల్లో మునిగిన పంట

ఇసుకమేటలతో పాటు..నీటి నిల్వతో కుళ్లిన మొక్కలు
రంగంలోకి దిగని వ్యవసాయ శాఖ అధికారులు
సాయం కోసం అన్నదాతల ఎదురుచూపు

 

హైదరాబాద్‌,జూలై15(జనంసాక్షి):భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలపై ఇసుక మేటలు వేశాయి. నీటమునిగి మొక్కలు కుళ్లిపోతున్నాయి. నష్టపోయిన రైతుల వేదన వర్ణనాతీతంగా ఉంది.
అధిక వర్షాలతో వచ్చిన వరదతో వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో సవిూప పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేశాయి. మైదాన ప్రాంతాలను తలపిస్తున్నాయి. వేల ఎకరాల్లో వేసిన సోయా, పత్తి పంటలు మునిగి పోయి నాశనమయ్యాయి. లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టానని, పంట పూర్తిగా దెబ్బతినడంతో ఎలా తిరిగి కట్టాలో తోచడం లేదని వాపోతున్నారు. ఇంత జరిగినా ఇంకా వ్యవసాయశాఖ రంగంలోకి దిగలేదు.
ఎన్ని ఎకరాల్లో పంటలు నీటమునిగాయో తెలుసుకునేందుకు వ్యవసాయశాఖ అంచనాలు వేయడం లేదు. మరోవైపు ’ప్రధాన మంత్రి పంటల బీమా’ పీఎంఎఫ్‌బీవై పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదు. దీంతో పరిహారం వచ్చే అవకాశాలు కనిపించక రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటలు పూర్తిగా నాశనమై రైతులు నష్టపోయిన మాట వాస్తవమే అయినా.. వివరాలు సేకరించి పంపాలని వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, అందువల్ల తామేం చేయలేమని వ్యవసాయాధికారి ఒకరు తెలిపారు. తమ వద్ద ఎలాంటి వివరాలు లేనందువల్లే చెప్పలేకపోతున్నామని
వివరించారు. అయితే, రాష్ట్రంలో 10.76 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని తమ అంచనాల్లో తేలినట్లు రైతుసంఘాలు చెబుతున్నాయి.?ఒక్క ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోనే 18 మండలాల్లో 1,03,305 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు అనధికారికంగా అంచనా వేశారు. నిజామాబాద్‌లో 40 వేల ఎకరాలు, కరీంనగర్‌లో 15 వేలు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని 191 గ్రామాల్లో 6493, కుమురం భీంలో 47,345, నిర్మల్‌ జిల్లాలో 20,294 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. కొన్ని జిల్లాల్లో పంటలు నీటమునిగినా వ్యవసాయాధికారులు వివరాలు వెల్లడిరచడం లేదు.
? పత్తి, సోయా, మొక్కజొన్న వంటి పైర్లు ప్రస్తుతం చిన్న మొక్కల దశలో ఉన్నాయని, ఎక్కువ రోజులు నీటిలో మునిగి ఉన్నా అధిక తేమను తట్టుకోలేక చనిపోతాయని సీనియర్‌ వ్యవసాయాధికారి ఒకరు చెప్పారు. ఈ పొలాల్లో ఉన్న నీటిని వెంటనే బయటికి పంపేలా రైతులు చర్యలు తీసుకోవాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. అధిక తేమకు తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశముందని, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపింది.