లక్ష మెజార్టీతో కెసిఆర్‌ను గెలిపిద్దాం

మరింత అభివృద్ది జరగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి

మహాకూటమి నేతలను నమ్మొద్దు

గ్రామాల్లో ప్రచారం ఉధృతం చేసిన హరీష్‌ రావు

సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఈసారి మళ్లీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారిని గజ్వేల్‌ నుంచిలక్ష పై ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి హరీష్‌ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం కొడకండ్ల, బయ్యారం గ్రామాల్లో టిఆరెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం జరిగింది. ప్రజలు కార్యకర్తలతో పాటు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గత నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పథకాలను చూసి మళ్లీ పార్టీని గెలిపించాలని ,కల్లబొల్లి పార్టీలు మాయమాటలు చెబుతున్నవారు చెప్పే మాటలు ఏ ఒక్కటి కూడా నమ్మొద్దని హరీష్‌ రావు అన్నారు.వేల కోట్ల రూపాయలతో గజ్వేల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన కెసిఆర్‌ మళ్లీ అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పటి వరకు పది శాతం అభివృద్ధి చేశాము , ఇంకా తొంభైశాతం అభివృద్ధి చేయాల్సిన అవకాశముందని ,ప్రతి ఒక్కరు కూడా టీఆర్స్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సిద్దిపేటకు వచ్చిన మెడికల్‌ కళాశాలను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌కి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉద్యమంలో, అభివృద్ధిలో ముందున్న మనం మెజార్టీలో కూడా ముందుండాలన్నారు. సిద్దిపేటలో పోటీ చేయడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. వచ్చే వానకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు రానున్నాయన్నారు. గడప గడపను వెళ్లి 80 శాతానికి పైగా ఓటింగ్‌ పెరిగేలా కృషి చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్‌ ఏర్పాటు చేయబోయే మహాకూటమి ఎప్పుడు ఇచ్చుక పోతదో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. పొత్తుల్లో ప్రధాన పార్టీ అయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శికే టికెట్‌ వచ్చే పరిస్థితి లేదంటే కూటమి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. సీపీఐని వదిలి వస్తే టీఆర్‌ఎస్‌తో కలిసి వస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు. 11రోజులు కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష బూనితే ఇక మాకు పుట్టగతులుండవని భావించి, తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌కి ఇక్కడి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లను అడ్డుకునేందుకు లేఖలు రాసిన చంద్రబాబుతో పొత్తులు పెట్టుకోవడం వారి అధికార దాహానికి నిదర్శనమన్నారు. తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకునే సీఎంగా మళ్లీ కేసీఆర్‌ను గెలిపిద్దామని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.