లాఠీచార్జిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్సీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 : ప్రజా సమస్యలపై మంగళవారంనాడు  సిపిఎం ఆధ్వర్యంలో  నిజామాబాద్‌లో తలపెట్టిన చలో కలెక్టరేట్‌ పాదయాత్రపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ సీతారాములు ఆరోపించారు. లాఠీచార్జిలో గాయపడిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను బుధవారంనాడు ఆయన ఆసుపత్రిలో పరామర్శించాడు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లాఠీచార్జి సంఘటనపై విచారణ జరిపించాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని, శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకొని విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడం శోచనీయమని అన్నారు. ఈ సంఘటనను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం  అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌ శ్రీరామ్‌రెడ్డికి ఒక వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సభ్యుడు కెవిరావు, రాష్ట్ర నాయకుడు వీరయ్య, జిల్లా నాయకుడు వెంకట్‌రాములు తదితరులున్నారు.

తాజావార్తలు