లాలూకు ఊరట!

– మరో ఆరు వారాలు బెయిల్‌ పొడిగింపు
న్యూఢిల్లీ, జూన్‌29(జనం సాక్షి): ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌కు రాంచీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనకు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను ఆరోగ్య కారణాల రీత్యా ఆగస్టు 17వ తేదీ వరకూ పొడిగించింది. పశుగ్రాసం కుంభకోణం కేసుల్లో ఆయన జైలుశిక్ష అనుభవిస్తూ ఇటీవల తాత్కాలిక బెయిల్‌ పొందారు. తన ఆరోగ్యం బాగోలేనందున బెయిల్‌ గడువు పొడిగించాలని లాలూ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన తాత్కాలిక బెయిల్‌ను జూలై 3వరకూ పొడిగించి తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. దీంతో శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. లాలూ తరఫున ఆయన న్యాయవాది ప్రబాత్‌ కుమార్‌ తాజా విజ్ఞప్తితో కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు, మే 11న లాలూకు జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ ఆరు వారాల తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేశారు. ఆ బెయిల్‌ ఈనెల 27తో గడువు ముగిసింది. దీంతో జూలై 3వ వరకూ తొలుత బెయిల్‌ను పొడిగించిన కోర్టు శుక్రవారం ఆగస్టు 17వరకూ దానిని మరోసారి పొడిగించింది. కోట్లాది రూపాయల పశుగ్రాసం కుంభకోణంలో లాలూ నాలుగు కేసుల్లో దోషిగా తేలారు. ప్రస్తుతం లాలూ హృద్రోగ సంబంధిత సమస్యలతో ముంబైలో చికిత్స పొందుతున్నారు.