లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యాకు తాజా డెడ్‌లైన్‌

ఆగ్‌స్ట్‌ 27న హాజరు కావాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ,జూన్‌30(జ‌నం సాక్షి): లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు పరారీ ఆర్ధిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌ కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. ఆగస్ట్‌ 27న కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. దేశంలోని బ్యాంకులను మోసగించి విదేశాలకు పారిపోయిన ఆర్ధిక నేరగాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మే 27 ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనికింద విచారణ సంస్థలకు పరారీలో ఉన్న ఆర్ధిక నేరగాళ్ల ఆస్తులను జప్తు చేసేందుకు… ఆదాయాన్ని, ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికారం లభిస్తుంది. గడువులోగా మాల్యా ప్రత్యేక కోర్టు ముందు హాజరుకాని పక్షంలో విజయ్‌మాల్యాను పరారీలో ఉన్నట్టు ప్రకటించి, ఆయనకు సంబంధించిన రూ.12,500 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు రూ.9000 కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను భారత్‌ రప్పించడానికి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. 2016 మార్చిలో లండన్‌ పారిపోయిన 62 ఏళ్ల విజయ్‌ మాల్యా… భారత కోర్టులు, విచారణ సంస్థలు ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా సంబంధిత కేసుల్లో విచారణకు రావడం లేదు. దీంతో ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కింద ఆయనను పరారీలో ఉన్న నేరస్తుడిగా గుర్తించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముంబయి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయాల రుణాలు ఎగ్గొట్టి దేశం విడిచివెళ్లిపోయిన విజయ్‌ మాల్యాపై చర్యలు తీసుకునేందుకు ఇటీవల ఈడీ అధికారులు ఫ్యూజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌ ఆర్డినెన్స్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అతడిని పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానంలో దరఖాస్తు సమర్పించింది. తాజాగా దీనిపై విచారించిన కోర్టు మాల్యాకు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 27లోగా మాల్యా కోర్టులో హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. ఒకవేళ మాల్యా రాకపోతే అతడిని ‘పరారీలో ఉన్న నేరస్థుడి’గా ప్రకటిస్తామని, అంతేగాక మాల్యాకు చెందిన రూ. 12,500కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసుకుంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీటిని స్వాధీనం చేసుకునేందుకు ఇటీవలే అమల్లోకి వచ్చిన ఫ్యూజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌ ఆర్డినెన్స్‌ను ప్రయోగించింది. ఏప్రిల్‌లో ఈ కొత్త ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం.. పారిపోయిన వ్యక్తుల ఆస్తుల్ని ఇక్కడ జప్తు చేసుకునే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై మాల్యా ఇటీవలే నోరువిప్పిన విషయం తెలిసిందే. తాను నిజాయతీపరుడినని, ఆరోపణల వెనుక నిజానిజాలేంటో చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందంటూ మాల్యా ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు. అందులో కేందప్రభుత్వం, దర్యాప్తు సంస్థలపై పలు ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అనుమతినిస్తే తన ఆస్తులను అమ్ముకుని రుణాలు చెల్లిస్తానని మాల్యా కోరడం గమనార్హం.