లెక్కలు తీయండి

– 2014 నుంచి మనం ఎన్ని ఉద్యోగాలు కల్పించాం
– మంత్రులను లెక్కలు అడిగిన ప్రధాని మోదీ!
న్యూఢిల్లీ, మే8(జ‌నం సాక్షి) : భాజపా అధికారంలో వచ్చిన నాటి నుంచి నాలుగేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామో లెక్కలు తీయాలని ప్రధాని నరేంద్రమోడీ మంత్రలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.  మే 26 నాటికి ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయింది. మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందే భాజపా ముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రూపంలో మరో సవాల్‌ ఉంది. ఈ నేపథ్యంలో 2014నాటి ఉద్యోగాల కల్పన హావిూ కీలకంగా మారే అవకాశాలున్నాయి. దీంతో ప్రధాని మోదీ ఆ విషయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇందుకోసం ఇప్పటికే అన్ని మంత్రిత్వశాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయా మంత్రిత్వశాఖలు ఈ నాలుగేళ్లలో ఏయే ప్రాజెక్టులు చేపట్టాయో, ఎన్ని కొత్త ఉద్యోగాలు కల్పించాయో సవివరంగా నివేదికలు అందించాలని సూచించినట్లు తెలుస్తోంది. అంతేగాక వృద్ధిరేటు పెంపునకు దోహదపడే విధంగా మంత్రిత్వశాఖలు ఏయే కార్యక్రమాలు చేపట్టాయో కూడా మోదీ తెలుసుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఈ వార్తలపై ప్రధానమంత్రి కార్యాలయం ఇంతవరకూ స్పందించలేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల విదేశీ పెట్టుబడులు పెరిగినప్పటికీ దాని కింద ఎన్ని కొత్త ఉద్యోగాలు కల్పించారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఇక 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వృద్ధిరేటు నాలుగేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.6శాతంగా నమోదైంది. ఇవన్నీ విపక్షాలకు ఆయుధాలుగా మారాయి. ఇప్పటికీ నిరుద్యోగం గరిష్ఠస్థాయిలోనే ఉందని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ముంబయికి చెందిన ఓ బిజినెస్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ చేపట్టిన అధ్యయనంలో భారత్‌లో నిరుద్యోగ రేటు ఏప్రిల్‌లో 5.86శాతానికి తగ్గింది. అంతకుముందు మార్చిలో ఇది 6.23శాతంగా ఉంది. ఇక మరి తాజాగా మంత్రులు ఇచ్చే నివేదికలు ఏం చేబుతాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
——————————–