లోక్‌పాల్‌పై కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ,జూలై 2(జ‌నం సాక్షి ): లోక్‌పాల్‌ అంశంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లోక్‌పాల్‌ను ఎప్పుడు నియమిస్తారో స్పష్టంగా తెలియజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని సూచించింది. ఇందుకు 10 రోజుల గడువు ఇచ్చింది. లోక్‌పాల్‌ నియామకం కోసం తీసుకోబోతున్న చర్యలపై పది రోజుల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని జస్టస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ ఆర్‌. భానుమతితో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను జులై 17కు వాయిదా వేసింది.లోక్‌పాల్‌ నియామకం చేపట్టాలని సుప్రీంకోర్టు గతేడాదిలోనే కేంద్రాన్ని ఆదేశించింది. అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా నియమించకపోవడంతో కామన్‌ కాజ్‌ అనే ఎన్జీవో సంస్థ న్యాయస్థానంలో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం లోక్‌పాల్‌ నియామకంపై 10రోజుల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.