వంశధారపై కలెక్టర్ అధ్యయనం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కాట్రగడలో పరిశీలన
శ్రీకాకుళం, జూలై 18 : వంశధార ప్రాజెక్టు ఫేజ్-2, స్టేజ్-2లో భాగంగా 87,88 ప్యాకేజీల్లో జరిగిన పనులపై కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధ్యయనం చేశారు. ప్రాజెక్టు ముఖద్వారం భామిని మండలం కాట్రగడ’బి’ వద్ద గతంలో జరిగి నిలిచిపోయిన ఓపెన్‌హెడ్ ఛానల్ పనులను పరిశీలించారు. ఈ ఛానల్ ద్వారా సింగిడి, పారాపురం, హిరమండలంలో రిజర్వాయర్లకు నీరు పంపించే విధానాన్ని వంశధార ఎస్‌ఈ రాంబాబు, ఇతర అధికారులు కలెక్టర్‌కు వివరించారు. నదిలో సుమారు రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఈ ఛానల్ ద్వారా ప్రధాన కాలువ నుంచి రిజర్వాయర్లకు మళ్లించే విధానాన్ని మ్యాపుల ఆధారంగా తెలియజేశారు. ఇక్కడ 300 మీటర్ల సైడ్‌వియర్ పనులు జరిపి, హెడ్‌స్లూయిస్ నిర్మిస్తామన్నారు. పనులు పూర్తయితే రెండు పంటలకు సాగునీరందించే వీలుందన్నారు. వడిశా ప్రభుత్వం ట్రైబ్యునల్‌కు వెల్లడంతో పనులు నిలిచిపోయాయన్న విషయాన్ని తెలియజేశారు. కేవలం 106 ఎకరాలు దెబ్బతింటాయని ఒడిశా ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతుందని వివరించారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి గతంలో ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. బ్యారేజీ కోసం 1961లో దామోదర సంజీవయ్య ఆవిష్కరించిన శిలాఫలకాన్ని, బ్యారేజీ సిబ్బంది కోసం నిర్మించిన గృహనిర్మాణ సముదాయాన్ని కూడా పరిశీలించారు. ప్రాజెక్టు పరిధిలో ఎంతమంది ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు, వారు పని చేస్తున్న ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు కొత్తగా వచ్చినందున ప్రాజెక్టు వివరాలు స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలని వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
నిర్వాశితులు సమస్యలపై సమీక్ష :- వంశధార ఫేజ్-2, స్టేజ్-2 రిజర్వాయర్ నిర్మాణంతో నిర్వాశితులవుతున్న వారికి అధికారులు సామరస్య పూర్వకంగా అవగాహన కల్పించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశించారు. హిరంమండలం వద్ద గల వంశధార అతిథిగృహంలో వంశధార, భూసేకరణ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. హిరమండలం, ఎల్.ఎన్.పేట, కొత్తూరు మండలాల్లోని 19 నిర్వాసిత గ్రామాల్లో నిర్వాసిత కుటుంబాలు, పునరావాసం, నష్ట పరిహారాల చెల్లింపుల స్థితిగతులపై సమీక్షించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే ప్రాధాన్య క్రమంలో గ్రామాల వారీగా నష్ట పరిహారాలు చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు చిత్రపటాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వంశధార ఎస్‌ఈ బి.రాంబాబు, ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు, భూసేకరణ కార్యాలయం కలెక్టర్లు భారతీదేవి, జయరాం, ప్రసాద్, తహశిల్దారు డి.చంద్రశేఖరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.