వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
కవిత, కెటిఆర్‌లకు కాలం చెల్లింది: జీవన్ రెడ్డి
కరీంనగర్,నవంబర్17(జనంసాక్షి): ఇప్పుడు కూడా జగిత్యాలతో పాటు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అన్ని సీట్లలో గెలుస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికరాంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 2014లో విూరు గెలవలేని జగిత్యాల స్థానాన్ని ప్రస్తుత ఎన్నికల్లో ఎలా గెలుస్తారని ఎంపీ కవితను కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం జగిత్యాల మండలం హన్మాజీపేట, పొరండ్ల, కన్నాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత, కేటీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశించి జీవన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని స్థానాలు తెరాస గెలిచినా.. తనని మాత్రం జగిత్యాల ప్రజలు గెలిపించారని.. ఈ ఎన్నికల్లోనూ జగిత్యాలతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతోందని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ఈ ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. గెలిచినా ఓడినా.. రాజకీయ జీవితంలో ఉంటేనే నిజమైన రాజకీయ నాయకుడని.. తాను ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉండే వాడిని కాబట్టే జగిత్యాల ప్రజలు గెలిపిస్తారన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో ఇంటింటి తాగునీరు అందిస్తామన్నారు.. రివర్స్ పంపింగ్ అన్నారు ఏం చేశారని తెరాసకు ప్రజలు ఓట్లు వేస్తారని జీవన్‌రెడ్డి విమర్శించారు.



