వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
టిఆర్‌ఎస్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం
కరీంనగర్,అక్టోబర్19(జనంసాక్షి): ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నదని మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ సభలతో తెలంగాణలో పరిస్థితి కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనుందన్నారు. టీఆర్‌ఎస్‌లో అధికారంలోకి వచ్చాక కరీంనగర్‌లో అభివృద్ధి కుంటుపడిందని, టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనలో కరీంనగర్ అన్ని రంగాల్లో వెనక్కి నెట్టి వేయబడిందన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌పై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు సేవచేసే అవకాశం వస్తుందని అన్నారు. అప్పుడు కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. మతపరమైన విద్వేషాలు రేపి బిజెపి ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్లడం దారుణమని అన్నారు.2014 టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎవరికీ కట్టించలేదని, దళితులకు మూడెకరాల భూమి అందని ద్రాక్షగానే మిగిలిందని, కేజీ టూ పీజీ ద్వారా ఎవరికి లాభం చేకూరలేదని, రైతులకు రుణమాఫీ కాలేదని, కొత్తగా పాఠశాలలేమి తీసుకురాలేదని అన్నారు. కరీంనగర్‌కు మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేదని, తాము తెచ్చిన శాతవాహన యూనివర్సిటీకి కనీస వీసీని కూడా నియమించలేదన్నారు. కరీంనగర్‌ను డల్లాస్‌లాగా,లండన్‌గా చేస్తామన్న ప్రగల్భాలు మాత్రం మిగిలాయన్నారు. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి శూన్యమని, కరీంనగర్‌కు నాలుగేళ్లలో ఒక పరిశ్రమ కూడా రాలేదని, కొత్త రేషన్‌కార్డులు కూడా ఇవ్వలేదని, అధికారంలోకి వస్తే మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రులు కట్టిస్తామని మాట తప్పారన్నారు. గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అధికారంలోకి వచ్చాక అమలు చేసి చూపించామని, ఇప్పుడు కూడా 2018లో కాంగ్రెస్ మేనిఫెస్టోలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరమే 10 లక్షల ఇళ్లు నిర్మాణం, 5 లక్షల ఆరోగ్యశ్రీ, నిరుద్యోగలకు భృతి, మహిళా సంఘాలకు లక్ష రూపాయల రాయితీ, పింఛన్లు 58 ఏళ్ల నుంచే రెండు వేల రూపాయలు, సంవత్సానికి ఉచితంగా ఆరు సిలిండర్లు, సన్నబియ్యం ఒక్కరికి ఏడు కిలోలు, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు ఉచితం, రైతులకు 2 లక్షల రుణమాఫీ కల్పిస్తామని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్‌ను గెలిపించాలని, వివిధ రంగాల్లోని నిపుణులతో కమిటీ వేసి అభివృద్ధి చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను తమ పార్టీలోకి లాగేందుకు కుట్ర చేస్తోందన్నారు. కరీంనగర్‌కు పేరుకే స్మార్ట్‌సిటీ వచ్చిందని, కానీ దాని దాఖలాలు ఎక్కడా కనిపించడం అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తామన్నారు.