వచ్చే ఏడాది నుంచి.. 

కోటి ఎకరాలకు సాగునీరు
దేశంలో గొప్ప పథకం రైతులకు పెట్టుబడి రాయితీ
రైతు బీమాతో అన్నదాత కుటుంబాల్లో భరోసా నింపుతున్నాం
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
న్యూఢిల్లీ, జూన్‌23(జ‌నం సాక్షి): వచ్చే ఏడాది నుంచి కోటి ఎకరాలకు సాగునీరు అందించే పథకం అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఇండియా టుడే అవార్డుకు తెలంగాణ రాష్ట్రం ఎంపికైంది. ప్రతిష్టాత్మక ఇండియాటుడే అవార్డును అందుకొనేందుకు శనివారం మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి విూడియాతో మాట్లాడారు. ఎకరానికి ఏడాదికి రూ. 8 వేలు పెట్టుబడి రాయితీ అందిస్తున్నామని తెలిపారు. పెట్టుబడి రాయితీ పథకంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ పథకాన్ని అందరూ ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. పెట్టుబడి రాయితీ పథకం ద్వారా 1.50 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతున్నారు. దేశంలోనే గొప్ప పథకం పెట్టుబడి రాయితీ పథకమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో గొప్ప పథకం రైతు బీమా పథకం అని మంత్రి వెల్లడించారు. రైతు మృతి చెందితే కుటుంబాలకు రూ. 5 లక్షలు అందించేది రైతు బీమా పథకం అని తెలిపారు. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతుబీమా పథకంలో అధికంగా లబ్ది పొందుతున్నది చిన్న, సన్నకారు రైతులే అని మంత్రి స్పష్టం చేశారు. అసంఘటిత శక్తిని సంఘటితం చేసేదే రైతు సమన్వయ సమితుల పథకం అని చెప్పారు. 1.61 లక్షల మంది సభ్యులను రైతు సమన్వయ సమితుల్లో నియమించామని తెలిపారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికోసం కేసీఆర్‌ అద్భుత పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. చిన్న, సన్న కారు రైతులకు న్యాయం చేసేందుకు కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. రైతుల అభ్యున్నతే కాకుండా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారంతో పాటు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ పాల్గొననున్నారు.