వట్టిమాటలు కట్టిపెట్టండి తెలంగాణ బిల్లు పెట్టండి – టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌

 

వరంగల్‌, డిసెంబర్‌ 2 (జనంసాక్షి) :

సీమాంధ్ర పార్టీల్లో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులు వట్టిమాటలు కట్టిపెట్టి ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ  శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టించాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన తెలంగాణ విద్యావంతుల వేదిక నాలుగో మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌, టీడీపీ, వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రత్యేక రాష్ట్రంపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. అలాకాకుండా ఆయా పార్టీల్లోని అధిష్టానం పెద్దలను ఒప్పించి అసెంబ్లీలో తీర్మానం చేయించాలని కోరారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సాధన కోసం సకల జనుల సమ్మె నిర్వహించిన విషయం అందరూ గుర్తించుకోవాలని అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి మీడియా, సినిమా తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ సీపీ నేత షర్మిలకు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసే హక్కులేదన్నారు. 950 మంది తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నా ఆ పార్టీలు కనీసం స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ఆయా పార్టీలు తెలంగాణపై తీర్మానం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు.