వడ్ల కల్లాలకాడికి పోదాం..
రైతుకు భరోసాగా నిలుద్దాం..
కాంగ్రెస్ సర్కారు రైతాంగ వ్యతిరేక చర్యలను ఖండిద్దాం
నేడు రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు
హైదరాబాద్, మే 15 (జనంసాక్షి):పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసగించడమేనని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈ మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు ఇయ్యక, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా మోసం చేస్తున్నారని, అందుకే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకు బిఆర్‌ఎస్ నిరసన చేపడుతోందని తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. రైతాంగానికి భరోసా కల్పించేదిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బిఆర్‌ఎస్ శ్రేణులు పోవాలని రైతులకు అండగా నిలవాలని శ్రేణులను కోరారు.