వన్డేల్లో రెండు బంతుల విధానం సరికాదు

క్రికెట్‌ వినాశనానికి ఇది పరిపూర్ణమైన పద్దతి

ట్విట్టర్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచి టెండుల్కర్‌ విమర్శలు

సచిన్‌ వ్యాఖ్యలతో ఏకీభవించిన పాక్‌ మాజీ ఆటగాడు యూనిస్‌

ముంబయి, జూన్‌22(జ‌నం సాక్షి ) : వన్డే మ్యాచ్‌లో రెండు కొత్త బంతులను ఉపయోగించడాన్ని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ తప్పుబట్టాడు. క్రికెట్‌ వినాశనానికి ఇది పరిపూర్ణమైన పద్ధతి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఇటీవల ఆస్టేల్రియాపై ఇంగ్లండ్‌ జట్టు 481 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్సిన నేపథ్యంలో సచిన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘వన్డే మ్యాచ్‌లో రెండు కొత్త బంతులు వాడటం అనేది వినాశనానికి అత్యుత్తమమైన విధానం. రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలించేలా బంతి పాతబడటానికి సమయం ఉండదు. రెండు కొత్త బంతుల విధానం వల్ల రివర్స్‌ స్వింగ్‌ను చూసే అవకాశం ఉండదు’ అని సచిన్‌ విమర్శించాడు. వన్డేల్లో రెండు కొత్త బంతులు ఉపయోగించేలా ఐసీసీ 2011 అక్టోబర్‌లో నిబంధనలను సవరించింది. దీని ప్రకారం ఒక ఓవర్‌ వేసేటప్పుడు ఒక అంపైర్‌ ఒక బంతిని వాడితే.. మరో ఓవర్‌కు రెండో అంపైర్‌ తన దగ్గరున్న బంతిని వాడతాడు. అంటే 50 ఓవర్ల ఆటలో ఒక బంతిని 25 ఓవర్ల చొప్పున వాడుతున్నారు. మ్యాచ్‌లను బ్యాట్స్‌మెన్‌ ఫ్రెండ్లీగా మార్చడం కోసం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై తాజాగా సచిన్‌ టెండూల్కర్‌ విమర్శల వర్షం కురిపించాడు. సచిన్‌ మాటలతో పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు వకార్‌ యూనిస్‌ ఏకీభవించాడు. ఈ కారణంతోనే ఎక్కువ మంది అటాకింగ్‌ ఫాస్ట్‌ బౌలర్లను తయారు చేయలేకపోతున్నామని, రెండు కొత్త బంతులు వాడటం వల్ల బౌలర్లు ఆత్మరక్షణలో పడిపోతున్నారన్నారు. లైనప్‌ మారుస్తున్నారు. నీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా సచిన్‌ అంటూ వకార్‌ యూనస్‌ ట్వీట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు.