వరద ముంపులో వరంగల్ నగరం- అవస్థలు పడుతున్న లోతట్టు ప్రాంతాల జనం
వరంగల్ బ్యూరో, జూలై 27 (జనం సాక్షి): వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇందులో భాగంగా అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని 39 వ డివిజన్ 32 వ డివిజన్ 33 వ డివిజన్ లతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు విపరీతంగా చేరడంతో గృహవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 39 వ డివిజన్లోని విద్యానగర్ కాష్కుంట తో పాటు 32 వ డివిజన్ 33వ డివిజన్లోని ఎస్ ఆర్ ఆర్ తోట, సి ఆర్ నగర్, బి ఆర్ నగర్, శాంతినగర్ జన్మభూమి జంక్షన్, కాష్కుంట, శివనగర్, సంతోషిమాత కాలనీ, సాయి నగర్, ఎన్టీఆర్ నగర్, డీకే నగర్, ఎస్ ఆర్ నగర్ మొదలైన ప్రాంతాల తోపాటు కరీమాబాదులోని పలు ప్రాంతాలు వర్షాల కారణంగా రోడ్లపై విపరీతంగా నీరు చేరి ఇండ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా బిఆర్ నగర్లో నీటిలో కొట్టుకుపోతున్న యువకులను ఎమ్మెల్యే నన్ను నరేందర్ కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు షేర్ల కిషోర్ నారగోని మురళీ స్వప్న ఆధ్వర్యంలో వరద నీటిలో మునిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా వరద నీటిలో మునిగిన ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని కోరుతున్నారు.