వరల్డ్‌కప్‌ విక్టరీ రిపీట్‌ అయ్యేనా..


కార్డిఫ్‌ ,జూన్‌ 19 (జనంసాక్షి) :

ఛాంపియన్స్‌ ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళుతోన్న టీమిండియా కీలకపోరుకు సిధ్దమైంది. కార్డిఫ్‌ వేదికగా శ్రీలంకతో రెండో సెవిూఫైనల్‌లో తలపడనుంది. టోర్నీలో అపజయమెరుగని టీమ్‌గా రికార్డున్న భారత్‌ లంకపై గెలిచి టైటిల్‌కు అడుగు దూరంలో నిలవాలని భావిస్తోంది. దీని కోసం గత రెండు రోజులూ ముమ్మరంగా సాధన చేసింది. లీగ్‌ దశను మాత్రమే దాటామని, దానికే సంబరపడొద్దంటూ, అసలు పోటీ ముందు ఉందంటూ ధోనీ చేసిన హెచ్చరికలను భారత క్రికెటర్లు సీరియస్‌గానే తీసుకున్నారు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. అన్ని మ్యాచ్‌లలోనూ గెలిచినప్పటకీ… తమలోని బలహీనతలను అధిగమించేందుకు ప్రయత్నించారు. బ్యాటింగ్‌లో ఓపెనర్లు సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. శిఖర్‌ ధావన్‌ వరుసగా రెండు సెంచరీలు సాధించడంతో పాటు చివరి మ్యాచ్‌లో పాక్‌పైనా అదరగొట్టాడు. అటు రోహిత్‌శర్మ కూడా నిలకడగా రాణిస్తుండడం , కోహ్లీ , రైనా సపోర్ట్‌ ఇస్తే మన జట్టుకు తిరుగుండదు. దినేష్‌ కార్తీక్‌ సమయోచిత ఇన్నింగ్స్‌కు ధోనీ , జడేజా మెరుపులు తోడైతే భారీస్కోరుపై నమ్మకం పెచ్చుకోవచ్చు. బౌలింగ్‌లో పేస్‌ త్రయం భువనేశ్వర్‌ , ఇశాంత్‌ శర్మ , ఉమేశ్‌ యాదవ్‌ చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో ఆకట్టుకుంటున్నారు. ఉమేశ్‌ యాదవ్‌ పరుగులు సమర్పించుకుంటున్నప్పటకీ… వికెట్లు తీస్తుండడం కలిసొచ్చే అంశం. స్పిన్‌ విభాగంలో అశ్విన్‌ కంటే రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా వచ్చి పూర్తి స్థాయి స్పిన్నర్‌గా చెలరేగిపోతోన్న జడేజాను ఎదుర్కోవడం లంక బ్యాట్స్‌మెన్‌కు కష్టమేనని చెప్పాలి. దీంతో అన్ని విభాగాల్లో ప్రత్యర్థి కంటే భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. దీనికి తోడు గత రికార్డులు కూడా భారత్‌కే అనుకూలంగా ఉండడం అడ్వాంటేజ్‌. మరోవైపు కీలక మ్యాచ్‌లో ఆస్టేల్రియాను ఓడించిన శ్రీలంకను తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదు. బ్యాటింగ్‌లో దిల్షాన్‌ , సంగక్కరా ఫామ్‌లో ఉన్నారు. జయవర్థనే కూడా ఆసీస్‌పై సూపర్‌ ఇన్నింగ్స్‌తో రాణించడం , తిరిమన్నే , చందిలా కూడా ఆకట్టుకోవడంతో వారికి ఇబ్బంది లేదు. బౌలింగ్‌లో కూడా లంక జట్టు మెరుగ్గాలే కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో కులశేఖర , మలింగాతో పాటు హెరాత్‌ లంక విజయంలో కీరోల్‌ ప్లే చేశారు. పార్ట్‌టైమ్‌ బౌలర్‌ దిల్షాన్‌ కూడా కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టుకు కీలకంగా మారాడు. ఈ నేపథ్యంలో భారత్‌పై బ్యాటింగ్‌ , బౌలింగ్‌ కాస్త మెరుగుపడినా… లంక గట్టిపోటీనివ్వడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అటు టోర్నీకి ముందు జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో లంకపై గెలవడం భారత్‌కు కాన్ఫిడెన్స్‌ ఇచ్చేదే. ఆ మ్యాచ్‌లో 334 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. భారత్‌ , శ్రీలంక చివరిసారిగా 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో తలపడగా… ధోనీసేననే విజయం వరించింది. దీంతో మరోసారి వరల్డ్‌కప్‌ విక్టరీని రిపీట్‌ చేయడం ద్వారా ఫైనల్‌కు చేరుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.