వరల్డ్ కప్పుకు పన్ను రాయితీల డిమాండ్
ఐసిసి డిమాండ్‌ను తోసిపుచ్చిన బిసిసిఐ
ముంబై,మార్చి5(జనంసాక్షి): ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ సవాలు విసిరింది. 2021లో జరిగే టీ20 వరల్డ్‌కప్, 2023లో జరిగే వన్డే వరల్డ్‌కప్ ఇండియాలో జరగాలంటే.. పన్ను రాయితీలు ఇవ్వాలని ఐసీసీ డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. ఆ పన్ను భారాన్ని బీసీసీఐయే భరించాలనీ ఐసీసీ స్పష్టం చేసింది. మొన్న జరిగిన ఐసీసీ తైమ్రాసిక సమావేశంలో ఈ విషయాన్ని బీసీసీఐకి చెప్పింది. అయితే ఐసీసీ ఇచ్చిన ఈ వార్నింగ్‌పై బోర్డు సీరియస్ అయింది. ఒకవేళ ఐసీసీ ఇదే మాటపై నిలబడితే.. టోర్నీలను ఇండియా నుంచి తరలించు కోవచ్చు అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేయడం విశేషం. పన్ను రాయితీలు ప్రభుత్వం చేతుల్లో ఉండే అంశం.. దీనిపై ఎలాంటి బయటి ఒత్తిళ్లు పని చేయవని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఈ
విషయంలో సంబంధిత మంత్రిత్వ శాఖ నిర్ణయానికి మేము కట్టుబడతాం. వరల్డ్‌కప్ ఇండియాలోనే జరగాలన్నది మా ఆకాంక్ష. కానీ ఐసీసీ వెనక్కి తగ్గకపోతే వాళ్లు టోర్నీని బయట జరుపుకోవచ్చు. ఇండియా నుంచి వాళ్లు తరలించాలనుకుంటే వాళ్ల ఇష్టం. టోర్నీ బయటకు వెళ్లిన తర్వాత ఆదాయం పంపిణీ చేస్తే ఎవరు ఎక్కువ నష్టపోయారో ఐసీసీకి తెలుస్తుంది. ఐసీసీ తీసుకున్న నిర్ణయాలు అన్నింటినీ అంగీకరించడం కుదరదు. అందులో చాలా వరకు బీసీసీఐకి సమ్మతం కానివే అని సదరు అధికారి స్పష్టం చేశారు. ఇండియా ప్రయోజనాలను దెబ్బ తీయడానికి ఐసీసీ ప్రయత్నిస్తున్నదని మరో అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.