వరల్డ్ కప్ : భారత్ మ్యాచ్‌లో పాక్ వ్యూహమే కొంపముంచిందా?

pakistan

 

ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ అనుసరించిన వ్యూహాలే కొంపముంచినట్టు తెలుస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎన్నో ఆశలతో పాక్ జట్టు మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ.. అంతిమంగా పాక్ జట్టుకు చేదు ఫలితం తప్పలేదు. చరిత్ర మార్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు చేసి, చివరికి టీమిండియా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. 
ఈ ఓటమి నేపథ్యంలో, పాక్ జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న ఓ తీవ్ర నిర్ణయం జట్టుపై ప్రభావం చూపిందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. కెప్టెన్ మిస్బా ఉల్ హక్ టాస్ కోల్పోవడంతోనే పాక్ జట్టు సగం ఓడింది. ఇక, భారీ లక్ష్యఛేదన క్రమంలో మేనేజ్‌మెంట్ సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్‌ను ఓపెనర్‌గా పంపింది. ఈ ఎత్తుగడ దారుణంగా బెడిసికొట్టిందన్నది వారి విశ్లేషణగా ఉంది.
భారీ అంచనాలతో క్రీజ్‌లోకి వచ్చిన యూనిస్ కేవలం 6 పరుగులు చేసి అవుటయ్యాడు. దాంతో, మిడిలార్డర్లో మిస్బా మినహా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్లు కరువయ్యారు. దీంతో, టీమిండియా బౌలర్ల జోరుకు అడ్డుకట్ట వేయడం పాక్ మిడిలార్డర్‌కు తలకు మించిన భారంగా మారింది. ఓవైపు కెప్టెన్ మిస్బా ఒంటరిపోరాటం చేస్తున్నా, మిగతా బ్యాట్స్‌మెన్ రాణించకపోవడంతో పాక్ చతికిలపడిపోయింది. 
అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఈ మ్యాచ్‌లో పాక్ తరపున భారీ భాగస్వామ్యాలు కొరవడ్డాయి. టి20 ఫార్మాట్‌ను మినహాయిస్తే, మిగతా ఫార్మాట్లలో భారీ భాగస్వామ్యాలే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాథమిక అంశాన్ని సీరియస్‌గా పట్టించుకోని పాక్ ఓటమిరూపంలో తగిన మూల్యం చెల్లించిందని వారు అభిప్రాయపడుతున్నారు.