వరికి బదులు అపరాలు పండిరచాలి
రైతులను చైతన్యం చేస్తున్న అధికారులు
ధాన్యం కొనుగోళ్లకు కూడా పక్కగా ఏర్పాట్లు
కామారెడ్డి,అక్టోబర్27 ( జనం సాక్షి); యాసంగిలో రైతులు వరి పండిరచవద్దని అధికారులు అన్నారు. మంత్రి వేముల ప్రశాంత రెడ్డి ఇప్పటికే ఈ మేరకు రైతులను చైతన్యం చేయాలని సూచించారు. వరి బదులు అపరాలు పండిరచాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అధికారులు రైతులను చైతన్యం చేయాలన్నారు. దీంతో జిల్లాలో కూడా అధికారులు అపరాల సాగుకు ప్రోత్సహిస్తున్నారు. ఓ వైపు వరి దృాన్యం విత్తకుండా చైతన్యం చేస్తూనే మరోవైపు ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్దం చేశారు. రైతులు వరిసాగు చేస్తే ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని, వరిపంటకు బదులుగా మినుములు, పొద్దు తిరుగుడు, వేరుశనగ, కుసుమలు, పెసర్ల వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారులు, విస్తీర్ణ అధికారులు గ్రామస్థాయిలో రైతు వేదికల్లో గ్రామాల వారీగా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు కూడా చేపట్టారు.
ఈ సీజన్‌లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కోతలు మొదలైనందున ఇప్పటికే జిల్లా లో 28 కేంద్రాలను ప్రారంభించారు. రైతులు ఇప్పుడిప్పుడే వరి కోతలను మొదలు పెట్టడంతో వారం రోజుల్లోగా కొనుగోలు కేంద్రాలకు పెద్దమొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు భావి స్తున్నారు. అప్పటిలోగా కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగానే రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రధానంగా నిజాంసాగర్ ప్రాజెక్ట్, కాలు వ దిగువన నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, నస్రూల్లాబాద్, పోచారం ప్రాజెక్ట్ కింద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలతో పాటు కామారెడ్డి, దోమకొండ, లింగంపేట తది తర మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్‌లో రెండు లక్షల ఎకరాలకు పైగా పంట లు సాగు కావడం ఇదే మొదటిసారి. ఈ లెక్కన 6.80 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగు బడులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 6 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశాలు ఉందని పౌరసర ఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సన్నరకం ధాన్యం 2లక్షల మెట్రి క్ టన్నులు, దొడ్డు రకం ధాన్యం 4 లక్షల మెట్రిక్ టన్నులు రానుందని అంచనా వేశారు. సీజన్‌లో పండిరచిన వరి ధాన్యాన్ని ప్రభుత్వాలు మద్దతు
ధరను ప్రకటించాయి. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి క్వింటాళ్లకురూ.1,960, బీ గ్రేడ్ క్వింటాలుకు రూ.1,940 చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. 17 శాతం తేమ ఉన్న వడ్లనే కొనుగోలు చేయనున్నారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధరకే వరి ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ మేనేజర్ జితేందర్ తెలిపారు.