వర్షాలకు గ్రామాలలో పొంగిపోర్లతున్న వాగులు వంకలు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 మండల కేంద్రంతో పాటు ఆర్.గార్లపాడు వావిలాల, ఉదండాపురం, చాగాపురం, సాబాద్, గోపాల్ దిన్నె, పెద్దదిన్నె, బట్లదిన్నె, మునగాల, నక్కలపల్లి, కోదండపురం, కొండేరు, జింకలపల్లి, శివనంపల్లి, ధర్మవరం, షేక్ పల్లి, సాసనూలు, బి. వీరాపురంతో పాటు ఆయా గ్రామాలలో రెండు రోజులపాటు కురుస్తున్న వర్షాలకు శుక్రవారం వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలలో వర్షాల కారణంగా డ్రైనేజీలు, ఇతర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు జలమయం అయిపోయాయి. ఈ సందర్భంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. అలాగే సాతర్ల గ్రామం నుండి వావిలాల గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గాన వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో పెద్ద వాగుకు భారీగా వరద నీరు చేరి గ్రామం మీదుగా గద్వాలకి వెళ్లే వాహనాలు నిలిచిపోయింది. ప్రతి సంవత్సరము వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే వాగు ఉదృతంగా ప్రవహించి పంట పొలాలు సైతం నీటిలో మునిగిపోవటమే గాక అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 44వ జాతీయ రహదారి నుంచి ఇటిక్యాల, సాతర్ల, వావిలాల గ్రామాల మీదుగా వెంకటాపురం ఐజ, రాయచూరుకు వెళ్లేందుకు ప్రధాన రహదారి కావడంతో వర్షకాలంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివిధ గ్రామాల ప్రయాణికులు వాపోతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు ఉన్నత అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం దృష్టికి తీసుకెళ్లి విన్నవించుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలను గుర్తించి మండలంలో ఉన్న ఆర్. గార్లపాడు, షేక్ పల్లి, సాతర్ల వంతెన నిర్మాణాలను చేపట్టి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని రైతులు, వాహనదారులు, ప్రయాణికులు విన్నవించుకున్నారు.