వలసదారుల్ని నిరోధిస్తాం
– డోనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్,ఆగస్టు 28(జనంసాక్షి):అమెరికన్ రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘తాను అధికారంలోకి వస్తే అక్రమంగా వచ్చే వలసదారులను కట్టడి చేస్తానని.. వారి మూలంగా అమెరికాలో నేరాలు పెరుగుతున్నాయ’ని అన్నారు. లోవా సిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ఈ విధంగా మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. నేను గెలిస్తే మొదటి రోజే అమెరికాలోకి అక్రమంగా చొరబడిన వారిని తొలగిస్తాను. ఒబామా-క్లింటన్ ఆధ్వర్వంలో ఎంతో మంది నేరగాళ్లు అక్రమంగా యూఎస్‌లోకి చొరబడుతున్నారని పేర్కొన్నారు.అక్రమ వలసదారులు రాకుండా పెద్ద గోడను నిర్మిస్తాను.. ఎగ్జిట్ ఎంట్రీ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తాను. వీసా గడువు ముగిసిన వారిని వెంటనే దేశం నుంచి వెళ్లిపోయేలా చూస్తానన్నారు. ట్రంప్‌కు ఓటేస్తే చట్టాలను కాపాడినట్లు.. అదే హిల్లరీ క్లింటన్‌కు ఓటేస్తే సరిహద్దు ద్వారాలు తెరిచినట్లని వెల్లడించారు. గతంలో ఆయన మెక్సికన్ సరిహద్దులో గోడ కడతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అక్రమ వలసదారుల వల్ల స్థానికులు తమ ఉద్యోగాలను కోల్పోవలసి వస్తుందని అలా జరగకుండా అడ్డుకుంటానని అన్నారు.