వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షిRKP NEWS 1): ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని రాళ్లవాగులో శనివారం తెల్లవారుజామున ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సిలువేరు నగేశ్‌(9), ఎస్కే ఖలీల్‌(6) శుక్రవారం మధ్యాహ్నం ఆడుకోడానికి వెళ్లి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ తెలియలేదు. దీంతో రాత్రి 9:30 గంటల సమయంలో వారి కుటుంబసభ్యులు రామకృష్ణాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం తెల్లవారుజామున గ్రామ శివారులోని వాగులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆడుకోడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయి ఉంటారని ఎస్సై దేవీదాస్‌ తెలిపారు.  స్థానికులు గుర్తించి చిన్నారుల మృత దేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.