వాట్సప్‌ సేవలకు అంతరాయం

న్యూఢిల్లీ,జనవరి 19(జనంసాక్షి):ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఆదివారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో మొరాయించడంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. వాట్సాప్‌ ఔటేజ్‌తో తాము ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు షేర్‌ చేసుకోలేకపోయామని వాట్సాప్‌ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాట్సాప్‌ స్టేటస్‌లోనూ తాము వీడియోలు, ఫోటోలను వీక్షించలేకపోయామని యూజర్లు ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌ పనిచేయకపోవడంతో యూజర్లు మెసేజ్‌లు పంపడం, రిసీవ్‌ చేసుకోవడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది.వాట్సాప్‌ డౌన్‌ కావడంతో ఇండియా, యూరప్‌, మలేషియా, ఇండోనేషియా, బ్రెజిల్‌ సహా పలు దేశాల యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఔటేజ్‌ మ్యాప్‌లో కనిపించింది. వాట్సాప్‌ డౌన్‌ కావడంతో యూజర్లు ట్విటర్‌ సేవలను ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో ట్విటర్‌ ఇండియాలో వాట్సాప్‌డౌన్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అయింది. వాట్సాప్‌ సేవలు కొద్దిసేపటికి పునరుద్ధరించడంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు.