వాడి వేడిగా సాగిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే
జనం సాక్షి, వంగూర్:
మండల కేంద్రంలో జనరల్ బాడీ సమావేశం ఎంపీపీ భీమమ్మ లాలూ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం వాడివేడిగా సాగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మొదట ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, విద్యుత్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధారణ నివేదికలు సమర్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, సమస్యలపై స్పందించాలని ఎమ్మెల్యే కోరారు. ఎంపీపీ అనుమతితో ప్రాధాన్యత శాఖల సమీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వైద్య అధికారి కృష్ణ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పోస్టింగ్ తీసుకున్న విషయం ఇప్పటికే తనకు తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పల్లె దావఖానాలపై వైద్య అధికారి కృష్ణను ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యాధికారులకు ఫోన్ చేసి, పల్లెదవాఖానాలు త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెల్త్ క్యాంపులకు అవసరమైన సామగ్రి క్యాంపు కార్యాలయంలో ఉందని, అక్కడికి వచ్చి సామాగ్రి తీసుకోవాలని ఆదేశించారు. దోమలు పెరగకుండా పాగింగ్ చేయాలని సూచించారు. అనంతరం విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలువురు సర్పంచులు తమ సమస్యలపై విద్యుత్ అధికారులను నిలదీశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ ఉన్నదా అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మిషన్ భగీరథ పై జరిగిన సమీక్షలో సర్పంచులు తమ గ్రామాలకు నీరు సరిగ్గా రావడంలేదని, ఫిర్యాదు చేయగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కోనాపూర్ సర్పంచ్ విద్యుత్ బిల్లుల విషయంపై సర్పంచిని ప్రశ్నించగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానం ఉంటుందని, విధానం ప్రకారం పనిచేయాలని కోరారు. మరి ఇబ్బందిగా ఉంటే తప్పకుండా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సమావేశం జరుగుతున్న సమయంలో తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని రంగాపూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ తప్పకుండా రంగాపూర్ గ్రామం మండలం చేయటానికి కృషి చేస్తానని, జనరల్ బాడీలో తీర్మానం చేసి పంపిస్తామని, సమస్యలపై స్పందిస్తున్నప్పుడు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో రఘుపతిపేట గ్రామానికి అనుకూలంగా తీర్మానం చేసిన వంగూరు మండలంలోని గ్రామాలు తిరిగి రంగాపూర్ మండలానికి అనుకూలంగా తీర్మానాలు ఇవ్వాలని కోరారు. అవకాశం ఉంటే తప్పకుండా రంగాపూర్ మండలం చేయడానికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమావేశం కొనసాగుతుండగా ఎంపీ రాములు సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని సమావేశం నుంచి వెళ్లిపోయారు, ఎంపీ రాములు సమావేశాన్ని కొనసాగించారు. రంగాపురం మండలం చేయాలని ప్రస్తావన రాగా, ఎంపీ స్పందిస్తూ, మండలం ఏర్పాటు అనేది చాలా సున్నితమైన అంశమని, అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. శాఖల వారీగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై సిబ్బందిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం పనితీరు సరిగ్గా లేదని, ఉన్నదా అధికారులు ఎవరు జనరల్ సమావేశానికి సరిగ్గా హాజరు కావడం లేదని, సమావేశాలు నామమాత్రంగా సాగుతున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పంచాయతీరాజ్ అధికారికి ఫోన్ చేసి, సమస్యల పరిష్కారం కోసం అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలని, తదుపరి సమావేశానికి తప్పకుండా ఉన్నత అధికారులు హాజరుకావాలని కోరారు. ప్రతిరోజు ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించాలని ఎంపిపిని ఆదేశించారు. హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని, అందుకు కృషి చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం జడ్పిటిసి కెవిఎన్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో పరిపాలన ఏమాత్రం బాగాలేదని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని అన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నామని ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. తాము రంగంలోకి వస్తే ఉద్యోగులు ఇబ్బంది పడవలసి వస్తుందని, ఉద్యోగులు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. కస్తూరిబాగాంధీ పాఠశాలలో మరుగుదొడ్లు మొదలైన సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి నిధులు కేటాయించాలని జెడ్పిటిసి కోరారు. ఈ సందర్భంగా ఎంపీ జోక్యం చేసుకొని ఇంజనీరింగ్ అధికారులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఇంటర్ కాలేజీకి అప్ డేట్ చేయడానికి ఎందుకు ప్రతిపాదనలు పంపలేదని కస్తూరిబా అధికారి పై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు పార్టీలకు అతీతంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారని జడ్పిటిసి విమర్శించారు. మరోసారి రంగాపూర్ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. సమావేశం నిర్వహణ అనంతరం వారిని ఎంపీ కలిసారు. తమ గ్రామాన్ని మండలంగా చేయాలని ఎంపీ పోతుగంటి రాములు వినతి పత్రం అందజేశారు.అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు, దేశంలో ఎక్కడా జరగని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ఎవరు ఇంతకుమించి చేయలేరని అన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎంపీ కోరారు. అధికారులు ఎక్కడ పనిచేస్తే అక్కడ సొంత ప్రాంతంగా భావించి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఈ సమావేశంలో విద్యుత్, ఉపాధి హామీ పథకం, పశు వైద్య శాఖపై ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్ లు ఆశించిన స్థాయిలో మంజూరు కాలేదని విపక్ష ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.