వామ్మో.. రైల్వే పరిసరాలు
– అసాంఘిక శక్తులకు అడ్డా
– రాత్రి వేళల్లో జంకుతున్న ప్రయాణికులు
– పోలీసులు చర్యలు చేపట్టాలంటున్న ప్రయాణికులు,స్థానికులు..
డోర్నకల్ అక్టోబర్ 14 జనం సాక్షి
ఉదయం నుంచి సాయంత్రం వరకూ సదాసీదాగా కనిపించే డోర్నకల్ రైల్వే పరిసర ప్రాంతం.. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నదని ప్రజలు ఆరోపిస్తున్నారు.చీకటి పడితే చాలు.. ఆ దారి పాదచారులు, వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నది.రాత్రి సమయాల్లో ఈ ప్రాంతం పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.రైల్వే వసతి గృహాల మీదుగా వెళ్లే దారి దట్టమైన పిచ్చి మొక్కలు పెరిగి చిట్టడివిని తలపిస్తుంది.తాగుబోతులకు, వ్యభిచారులకు,దొంగలకు ఆవాసంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.రైల్వే పోలీసుల పరిధిలో ఉండడం వలన స్థానిక ఠాణా పోలీసులు అంతగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.ఈ ప్రాంతంలో రాత్రివేళల్లో ప్రజల సంచారం పెద్దగా లేకపోవడంతో రైల్వే కోటర్స్ వెనుక వైపు అక్రమార్కులు,అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.దీనికితోడు ఈ ప్రాంతమంతా వీధిదీపాలు లేక అంధకారం అలుముకోవడం వారికి అనుకూలంగా మారుతున్నది.
సర్వసాధారణం..
రైల్వే ట్రాక్ పక్కనే నిర్మానుష ప్రాంతం ఉండడం దీంతో అక్రమ మద్యం,జూదం,వ్యభిచారం లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఇక్కడ సర్వసాధారమైనట్లు చెబుతున్నారు.రాత్రి వేళల్లో అక్కడ ఎక్కువగా విటులతో పాటు మద్యంప్రియుల సంచారం ఎక్కువగా ఉంటుంది.పక్కనే ఉన్న రైల్వే పార్కు నిర్వహణకు నోచుకోక చెత్తాచెదారం అలుముకుంది.అదేవిధంగా అటుగా వెళ్లే మహిళ ప్రయాణికులు భయాందోళన గురవుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో దట్టంగా పెరిగిన మొక్కలను తొలగించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.వీధిదీపాలు,సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి,రాత్రి వేళల్లో నిరంతరం పోలీసుల గస్తీ,నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రైల్వే జిఆర్పి ఎస్ఐ మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో తమ సిబ్బందితో నిఘా పెంచుతామన్నారు.ఆ ప్రాంతంలో సమస్య ఉన్నట్లయితే పరిష్కరిస్తామని తెలిపారు.
Attachments area