వాయుగుండంగా అల్పపీడనం

హైదరాబాద్‌లో భారీ వర్షం
విశాఖపట్నం/హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) :
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం మధ్యాహ్నం వాతావరణ కేంద్రం అధికారులు మాట్లాడుతూ కోల్‌కతాకు 200 కిలో మీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని తెలిపారు.     దీంతో కోస్తా జిల్లాల్లోనూ, రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలోను ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురియనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం జంట నగరాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎల్బీనగర్‌, మలక్‌పేట, కోఠి, ఆబిడ్స్‌, నాంపల్లి, లక్డీకాపూల్‌, మెహదీపట్నం, అమీర్‌పేట, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. చెట్లు కూలి రోడ్లపై పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రానున్న 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.