వారం రోజుల ముందుగానే నైరుతి

న్యూఢిల్లీ,మే12(జ‌నం సాక్షి): ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు నిర్ణీత గడువు కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణం కంటే వారం రోజుల ముందుగానే మే 25న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వెల్లడించింది. సాధారణంగా జూన్‌ 1వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉండగా, గడిచిన ఏడేండ్లతో పోల్చితే ఈ ఏడాది రుతుపవనాలు చాలా ముందుగా దేశంలోకి ప్రవేశిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలావుంటే హైదరాబాద్‌  నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం చిరుజల్లులు పడ్డాయి. ప్రభాత సమయం నుంచే నగరంలో వాతావరణం చల్లబడింది. కూకట్‌పల్లి, ఆర్‌టిసి క్రాస్‌రోడ్స్‌, తార్నాక, కుషాయిగూడ, కీసర, దమ్మయిగూడ, నాగారం, జవహర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఈ వేసవి నిప్పుల కుంపటిగా మారిన క్రమంలో శనివారం చిరుజల్లులు పడడంతో ప్రజలకు కాసింత ఉపశమనం కలిగింది.