వారి వెతలు అన్నిన్నికాదయా…
ఖమ్మం : ఒక్క ఆర్డినెన్సుతో తెలంగాణలోని ఆరు మండలాల ప్రజలను.. ఏపీ పౌరులుగా మార్చేశారు. ఆ తర్వాత వారెలా ఉన్నారో వారి వెతలేంటో తెలుసుకోవడాన్ని విస్మరించారు. పాత రాష్ట్రం పట్టించుకోక.. కొత్త రాష్ట్రం కష్టాలు తీర్చక అక్కడివారు నానా అగచాట్లూ పడుతున్నారు. ఇది.. తెలంగాణ నుంచి ఏపీలోకి కలిసిన పోలవరం ముంపు మండలాల ప్రజల వేదన. ఎన్నిసార్లు విన్నవించినా స్పందన రాకపోవడంతో.. ప్రభుత్వాన్ని కదిలించేందుకు ఈనెల 20న ముంపు మండలాల బంద్‌ను పాటించాలని నిర్ణయించారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..
పోలవరం ముంపు మండలాల ప్రజలు ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు, దాని పరీవాహకంలోని ముంపు ప్రాంతాలూ ఒకే రాష్ట్రంలో ఉండాలన్న కారణంతో.. మోదీ సర్కారు ఏకంగా ఆరు మండలాలను ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి బదలాయించింది. ఒక్క ఆర్డినెన్సుతో.. అప్పటిదాకా తెలంగాణ పౌరులుగా ఉన్న కూనవరం, చింతూరు, నెల్లిపాక, వీఆర్‌పురం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు ఏపీ పౌరులుగా మారిపోయారు. అయితే.. అప్పటి నుంచే వారి కష్టాలూ మొదలయ్యాయి.
అన్ని సమస్యలే..
భద్రాచలం మినహా ముంపు మండలాలను ఏపీలో కలిపేయడంతో.. ఈ ప్రాంత ప్రజలకు ఆర్డీఓ కార్యాలయం, ఆర్టీసీ డిపో, న్యాయస్థానం, ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీతో పాటు డివిజన్ ఆఫీసులు లేకుండా పోయాయి. ఈ మండలాలు తమ ప్రాంతానికి చెందనివి అంటూ తెలంగాణ ఉద్యోగులంతా ఇక్కడి నుంచి తరలిపోయారు. వీరి స్థానంలో ఏపీ నుంచి ఏ ఒక్కరూ రాలేదు. దీంతో ఇప్పుడు విలీన ప్రాంతంలోని కాలేజీల్లో అధ్యాపకులు లేరు.. స్కూళ్లకు ఉపాధ్యాయులు రారు.. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కనిపించరు. గడచిన 15 నెలలుగా ముంపు మండలాలన్నింటా ఇదే పరిస్థితి.
పలు డిమాండ్లు..
తమను ఏపీలో కలిపేసుకున్నాక.. ఒక్క నాయకుడూ మంపు మండలాలను సందర్శించ లేదంటూ ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. వారం వారం సింగపూరు, మలేసియా, జపాన్ అంటూ విదేశాలు తిరిగే ముఖ్యమంత్రికి తమను పరామర్శించాలన్న ధ్యాసే లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ వెతలు తీర్చాలంటూ ప్రభుత్వాన్ని కదిలించేందుకు ఈనెల 20న ముంపు మండలాల ప్రజలు బంద్ పాటించాలని నిర్ణయించారు. సీపీఎం మద్దతుతో వీరీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందిని తక్షణమే నియమించాలని, చింతూరు, కుక్కునూరులలో ఆర్డీఓ, ఐటీడీఏ తదితర డివిజన్ కార్యాలయాలు, కోర్టులు, వంద పడకల ఆసుపత్రులు, ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.