వాల్‌మార్ట్ లాబీయింగ్‌పై విచారణకు సిద్ధం
– ప్రకటించిన కేంద్ర మంత్రి కమల్‌నాథ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 12 (జనంసాక్షి) :
భారత చిల్లర వర్తక రంగంలోకి ఎఫ్‌డీఐల అనుమతి కోసం వాల్‌మార్ట్ లాబీయింగ్‌పై రిటైర్ట్ న్యాయమూర్తితో విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బుధావారం లోక్‌సభలో ఈమేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ ప్రకటించారు. ఉదయం ఉభయసభలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. దీంతో కమల్‌నాథ్ జోక్యం చేసుకుని రిటైర్డ్ న్యాయమూర్తి శాఖ ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికైనా సభ కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులను కోరారు. అనంతరం బొగ్గు గనుల కేటాయింపుపై బీఎస్పీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుపై ప్రభుత్వం బదులివ్వాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. వారికి సర్దిచెప్పేందుకు స్పీకర్ యత్నించారు. ప్రయోజనం లేకపోవడంతో మధ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా రాజ్యసభలో ఎస్సీ, ఎస్టీల ఉద్యోగుల పదోన్నతి కోటాపై బుధవారం కూడా ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికార, ప్రతిపక్ష సభ్యులమధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గందరగోళంగా మారడంతో రాజ్యసభ సమావేశాన్ని గురువారంనాటికి వాయిదా వేశారు.