విండీస్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా శామ్యూల్స్‌

జమైకా ,జూలై 6  (జనంసాక్షి):

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ మార్లోన్‌ శామ్యూల్స్‌ 2012 సంవత్సరానికి గానూ వెస్టిండీస్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అన్ని ఫార్మేట్లలోనూ నిలకడగా రాణించడంతో విండీస్‌ బోర్డ్‌ శామ్యూల్స్‌కు అవార్డును ప్రకటించింది. దీనితో పాటు వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌ కూడా అతన్నే వరించింది. గత ఏడాది శామ్యూల్స్‌ 32.13 యావరేజ్‌తో 482 పరుగులు చేశాడు. దీనిలో రెండు సెంచరీలు ఉన్నాయి.అటు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ శివనారాయణ్‌ చంద్రపాల్‌ టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఐసిసి టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో చంద్రపాల్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గత ఏడాది టెస్టుల్లో అద్భుతంగా రాణించిన చంద్రపాల్‌ 98.70 సగటుతో 987 పరుగులు చేశాడు. దీనిలో మూడు సెంచరీలు , ఐదు అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ వెస్టిండీస్‌ టీ ట్వంటీ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు గెలుచుకున్నాడు. గత ఏడాది నరైన్‌ 16.87 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే విండీస్‌ ఎమర్జింగ్‌ క్రికెటర్‌ అవార్డును కిరణ్‌ పావెల్‌ దక్కించుకున్నాడు.