విండీస్‌ టూర్‌కు భారత

 

జట్టు మేనేజర్‌గా ఎంవీ శ్రీధర్‌

ముంబై ,జూన్‌ 19 (జనంసాక్షి) :

వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే భారత క్రికెట్‌ జట్టుకు మాజీ క్రికెటర్‌ ఎంవీ శ్రీధర్‌ మేనేజర్‌గా నియమితుడయ్యాడు. ఆ మేరకు బీసిసిఐ ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీధర్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు. రొటేషన్‌ పధ్ధతిలో ఈ సారి హైదరాబాద్‌ నుండి మేనేజర్‌ బాధ్యతలకు అవకాశం దక్కింది. శ్రీధర్‌ గతంలో ఆస్టేల్రియా పర్యటనకు టీమిండియా మేనేజర్‌గా వ్యవహరించాడు. 2008 ఆసీస్‌ పర్యటనలో అత్యంత వివాదాస్పదమైన భజ్జీ-సైమండ్స్‌ మాటల యుధ్దం , అంపైరింగ్‌ ఏకపక్ష నిర్ణయాలు వంటి క్లిష్ట సమయాల్లో శ్రీధర్‌ చురుకైన పాత్ర వహించడం ద్వారా భారత వాదనను విచారణలో చక్కగా వినిపించాడు. ఇదిలా ఉంటే ఆస్టేల్రియా పర్యటనకు వెళ్ళే అండర్‌ 19 జట్టుకు మేనేజర్‌గా అరిందమ్‌ గంగూలీని బీసిసిఐ ఎంపిక చేసింది. ప్రస్తుతం ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడుతోన్న సీనియర్‌ టీమ్‌ జూన్‌ 28 నుండి జరిగే ట్రై సిరీస్‌ కోసం కరేబియన్‌ దీవులకు వెళ్ళనుంది. ఈ సిరీస్‌లో భారత్‌ , వెస్టిండీస్‌తో పాటు శ్రీలంక మూడో జట్టుగా ఆడనుంది.