విండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ మరో డెడ్ లైన్

బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ) చెల్లించాల్సి ఉన్న నష్ట పరిహారం అంశానికి సంబంధించి బీసీసీఐ మరోసారి డెడ్ లైన్ విధించింది.  గతేడాది అక్టోబర్ లో విండీస్ ఆకస్మికంగా భారత పర్యటన నుంచి వైదొలగడంపై 42 మిలియన్ డాలర్ల (రూ.245.6కోట్లు) దావాను బీసీసీఐ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై ఒకసారి గడువు ఇచ్చిన బీసీసీఐ మరో మూడు రోజుల్లో డబ్యూఐసీబీ స్పందించాల్సిన అవసరం ఉందని ఈ మెయిల్ ద్వారా స్పష్టం చేసింది.

పారితోషకాల విషయంలో  విండీస్  క్రికెటర్లు తన పర్యటన రద్దు చేసుకోవడంతో ఆ దేశ బోర్డుకు గట్టి షాక్ తగిలింది. ఇంకా ఒక వన్డే మిగిలి ఉండగానే విండీస్ క్రికెట్ జట్టు పర్యటన రద్దు చేసుకుంది.  ఆ నేపథ్యంలో ఒకే వన్డే మ్యాచ్ తో పాటు భారత-విండీస్ ల టెస్ట్ సిరీస్ కు గండిపడింది.దీంతో విండీస్ బోర్డు తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ బీసీసీఐ దావా దాఖలు చేసింది.