విందుభోజనం తిని పలువురికి అస్వస్థత

బేల: ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం సాంగ్డి గ్రామంలో వివాహానికి ముందు చేసే బోనాల వేడుక కోసం చేసిన ఆహారాన్ని తిన్న దాదాపు 50మంది అస్వస్థతకు గురయ్యారు. వివాహ మ¬త్సవాల్లో పెళ్లికి ముందు రోజు బోనాల పండుగ చేయడం ఆనవాయితీ. ఈ వంటకాన్ని తిన్న వారికి వాంతులు ప్రారంభం కావడంతో 108 వాహనంలో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. కొందరికి స్థానికంగానే చికిత్సను అందిస్తున్నారు. కలుషితాహారానికి సంబంధించిన సమాచారం తెలియగానే రిమ్స్‌ డైరెక్టర్‌ హేమంతరావు, సూపరింటెండెంట్‌ అశోక్‌ బాధితులకు వైద్య సేవలందించడానికి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. మొదటగా రిమ్స్‌కు చేరుకున్న ఏడుగురికి వైద్య సహాయం ప్రారంభించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తున్నారు. ఆదిలాబాద్‌ తహసీల్దార్‌ సుభాష్‌చంద్ర ఆసుపత్రిలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.