వింబుల్డన్‌ టాప్‌ సీడ్స్‌గా జొకోవిచ్‌ , సెరెనా


లండన్‌ ,జూన్‌ 19 (జనంసాక్షి) :  వచ్చే వారం ప్రారంభం కానున్న గ్రాస్‌ కోర్ట్‌ గ్రాండ్‌శ్లామ్‌ టోర్నీ వింబుల్డన్‌ డ్రాను ప్రకటించారు. సెర్బియా సంచలనం నోవక్‌ జొకోవిచ్‌ పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే రెండో సీడ్‌గానూ , ఫెదరర్‌ మూడో సీడ్‌గానూ ఆడనున్నారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ డేవిడ్‌ ఫెర్రర్‌కు నాలుగో సీడ్‌ దక్కగా… ఫ్రెంచ్‌ ఛాంపియన్‌ రఫెల్‌ నాదల్‌కు ఐదో సీడింగ్‌ లభించింది. సీడింగ్స్‌ ప్రకారం క్వార్టర్‌ ఫైనల్లోనే భీకర సమరాన్ని చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. డ్రాను చూస్తే రఫెల్‌ నాదల్‌ క్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ , ముర్రే , ఫెదరర్‌లలో ఒకరితో తలపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదోసీడింగ్‌ దక్కినప్పటకీ… టైటిల్‌ రేసులో నాదలే ముందున్నాడు. గాయం నుండి కోలుకుని తిరిగి రాకెట్‌ పట్టిన తర్వాత 45 మ్యాచ్‌లు ఆడిన నాదల్‌ 43 విజయాలు సాధించాడు. అయితే గత ఏడాది వింబుల్డన్‌లో మాత్రం నాదల్‌ రెండో రౌండ్‌లోనే ఓడిపోయాడు. ఇదిలా ఉంటే వింబుల్డన్‌ సీడింగ్స్‌ కేటాయింపుపై మరోసారి విమర్శలు వచ్చాయి. గ్రాస్‌కోర్టుపై ఆయా ఆటగాళ్ళ ప్రదర్శన ఆధారంగానే దీనిని కేటాయిస్తుండడం సరికాదని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. మహిళల సింగిల్స్‌లో అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌కు టాప్‌ సీడింగ్‌ దక్కింది. బెలారస్‌ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా రెండో సీడ్‌గా ఆడనుండగా…రష్యా అందాల భామ మరియా షరపోవా మూడో సీడ్‌గా బరిలోకి దిగనుంది.