వింబుల్డన్‌ నుండి వీనస్‌ ఔట్‌


న్యూయార్క్‌ ,జూన్‌ 19 (జనంసాక్షి) :

ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నీ నుండి వీనస్‌ విలియమ్స్‌ తప్పుకుంది. వచ్చే వారం ప్రారంభం కానున్న ఈ గ్రాండ్‌శ్లామ్‌ టోర్నీలో తాను ఆడడం లేదని ఆమె ప్రకటించింది. ఐదుసార్లు వింబుల్డన్‌ టైటిల్‌ గెలుచుకున్న వీనస్‌ ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతోంది. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో కూడా ఈ అమెరికా నల్లకలువ నిరాశపరిచింది. తొలి రౌండ్‌లోనే పరాజయం పాలై ఇంటిదారి పట్టింది. 33 ఏళ్ళ వీనస్‌ విలియమ్స్‌ వెన్నునొప్పి కారణంగా సింగిల్స్‌తో పాటు డబుల్స్‌ నుండి వైదొలుగుతున్నట్టు ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. గ్రాస్‌ కోర్టుపై ఆడడం తాను ఎప్పుడూ ఆస్వాదిస్తానని , దురదృష్టవశాత్తూ ఈ ఏడాది వింబుల్డన్‌కు దూరమవడంపై చాలా నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో కోలుకుని జూలై రెండో వారంలో ప్రారంభమయ్యే మైలాన్‌ వరల్డ్‌ టెన్నిస్‌లో రీ ఎంట్రీ ఇస్తానని తెలిపింది.