వికలాంగులు ఓటేసేలా ప్రత్యేక ఏర్పాట్లు

కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి

సిరిసిల్ల, నవంబర్‌11(జనంసాక్షి)

ఎన్నికల్లో వికలాంగులు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి తెలిపారు. ఈ మేరకు అయన ఆదివారం ఒక ప్రకటన జారీ చేసారు. డిసెంబర్‌ 7 తేదీన పోలింగ్‌ రోజున వికలాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా వికలాంగులు ఓటర్లను గుర్తించామని, జిల్లాలో 5 వేల మందికి పైగా ఉన్నారని తెలిపారు. వీరికి ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వికలాంగ ఓటర్లు వరుసలో నిలువకుండా నేరుగా పోలింగ్‌ బూత్‌లోనికి వెళ్లి ఓటు వేయవచ్చని తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేశామని, పోలింగ్‌ రోజున వీల్‌ ఛైర్స్‌ అందుబాటులో ఉంచుతామన్నారు. శారీరక వికలాంగులతోపాటు మూగ, చెవిటి, అంధ ఓటర్లకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బ్రెయిలీ లిపిలో ప్రాథమిక వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక సైన్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అవసరమైన వికలాంగులకు వలంటీర్‌ సహకారం అందిస్తామన్నారు. ఓటు హక్కు వినియోగానికి వికలాంగత్వం అడ్డురాకూడదన్నారు. వికలాంగులతోపాటు గర్భిణులు, 80 ఏళ్లు దాటిన వయో వ అద్ధులైన ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలింగ్‌ కేంద్రం వారీగా వికలాంగుల కోసం నోడల్‌ అధికారిని నియమించినట్లు కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి తెలిపారు.