విజయ్‌మాల్యా ఆస్తులను గుర్తించిన ఇడి

159చోట్ల ఆస్తులున్నట్లు పటియాల కోర్టుకు వివరాల సమర్పణ

న్యూఢిల్లీ,జూలై5(జ‌నం సాక్షి ): భారత బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా ఆస్తుల వివరాలను అధికారులు ఎట్టకేలకు నిగ్గుతేల్చారు. ఆయనకు మొత్తం 159 చోట్ల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఈడీతో కలిసి బెంగళూరు పోలీసులు ఇవాళ ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టుకు నివేదిక సమర్పించారు. విజయ్‌ మాల్యాకు చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు ఇంకొంత సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. కాగా పరారీ ఆర్థిక నేరగాళ్ల కోసం ఏర్పాటైన ప్రత్యేక కోర్టు వచ్చేనెల 27 లోగా విజయ్‌ మాల్యా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు రూ.9000 కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను భారత్‌ రప్పించడానికి విచారణ సంస్థలు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. 2016 మార్చిలో లండన్‌ పారిపోయిన 62 ఏళ్ల విజయ్‌ మాల్యా… భారత కోర్టులు ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా సంబంధిత కేసుల్లో విచారణకు రావడం లేదు. దీంతో ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కింద ఆయనను పరారీలో ఉన్న నేరస్తుడిగా గుర్తించాలంటూ ఈడీ గత నెల 22న ముంబయి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.