విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు: ఎన్‌ఎస్‌యూఐ

నిజామాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ఫీజు రీయంబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌, రాష్ట్ర బాధ్యుడు ఫిరోజ్‌ఖాన్‌లు అన్నారు. దీనిపై ఇచ్చిన హావిూలు అమలు కాక విద్యార్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంగళవారం నాడు వారు తెలంగాణ యూనివర్సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేజీ టూ పీజీ విద్యపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదన్నారు. కార్పొరేట్‌ విద్యను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరచాలని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గత రెండేళ్లుగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగిస్తున్న పాలన విద్యారంగాన్ని దెబ్బతీసేదిగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.  ప్రజలకు న్యాయం చేసేందుకు యువజన కాంగ్రెస్‌ నడుం బిగించిందని ఉద్ఘాటించారు. మళ్లీ కాంగ్రెస్‌పార్టీకి పట్టం కడితేనే తెలంగాణ రాత మారుతుందని అభిప్రాయపడ్డారు. రైతు రుణమాఫీ, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల వ్యవహారం చివరికి తెరాస నేతలను తరిమికొట్టే పరస్థితికి వస్తుందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. పేద, దళిత ,మైనార్టీ విద్యార్తులపై వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు.