విద్యారంగాన్ని అత్యున్నతంగా మార్చాలి ! 

విద్యారంగంలో పెడధోరణులు సమాజాన్ని నాశనం చేయగలవు. విద్యారంగాన్ని ఎంతగా ఉన్నతంగా తీర్చిదిద్ది ..ఎంతగా పెట్టుబడులు పెడితే సమాజం అంతగా ఉన్నతీకరణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి విద్యను కల్పించి,..బతకడానికి గల అవకాశాలను పెంచాలి. ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు రావాలని లేదా కావాలని ఎవరూ కోరుకోవడం లేదు. ప్రైవేట్‌ రంగం ఇవ్వాళ సమాజాన్ని శాసిస్తోంది. అయితే ప్రైవేట్‌ రంగందే పై చేయి అయినా చదువుకుని అందులో నిలబడగలిగే పౌరులను తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తూనే .. ఉన్నతవిద్యకు తగిన అవకాశాలు కల్పించాలి. ఈ లక్ష్యం లేకుండా విద్యారంగాన్ని వ్యాపార రంగంగా చూస్తే మంచిది కాదు. చదువు అన్నది ప్రాథమిక హక్కు. తెలంగాణలో కెజి టూ పిజి విద్యను ఉచితంగా అందిస్తామన్న ఆశలు కల్పించిన సిఎం కెసిఆర్‌ ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టారు. ఆ దిశగా ఆలోచన లేదా చర్చ చేయడం లేదు. ఇలాచేసివుంటే కెసిఆర్‌కు మంచి పేరు వచ్చి ఉండేది. ఎపిలో ఇంగ్లీష్‌ విూడియం వల్ల పేదలకు మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే ఎపిలో ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఉసురు తీసిన ప్రభుత్వం వాటిలోని విద్యార్థులను త్రిశంకుస్వర్గంలోకి నెట్టింది. తమ విద్యా సంస్థను ప్రభుత్వానికి అప్పగించేయడంతో మూసేస్తు న్నామని, విద్యార్థులు టిసిలు తీసుకోవాలని వెళ్లిపోవాలని ఆయా విద్యా సంస్థలు చెప్తుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాష్ట్రంలో ఎక్కడిక్కడే ఆందోళనలకు దిగుతున్నారు. తమ పిల్లల చదువు ఏమి కావాలని వారు ఆగ్రహం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ఆయా సంస్థలకు ఎయిడ్‌ ఇచ్చి కాపాడాయి. దాంతో వారు స్కూళ్లను నడప గలిగారు. కానీ ఇప్పుడు అలా జరగకుండా ఎపిలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎవరు కూడా సమర్థించరు. ఎయిడెడ్‌ స్కూళ్లు సక్రంగా నడపలేకపోతే…నిధులను దుబారా చేయడమో, వీధా చేయడమో చేస్తే నిలదీయాలి. ఎయిడ్‌ ఆపాలి. కానీ అలా కాకుండా ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకోవడం మంచిది కాదు. ఒకవేళ వాటిని స్వాధీనం చేసుకుంటే విద్యార్థుల జీవితాల గురించి మాట్లాడాలి. ప్రయివేట్‌కు మారిన ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లోని విద్యార్థులను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్చించడంలో ప్రభుత్వం విఫలమైంది. దగ్గరలో ప్రయివేట్‌ విద్యా సంస్థలు అందుబాటులో లేకపోవడం, ఉన్న విద్యా సంస్థల్లో సీట్లు ఖాళీ లేకపోవడంతో ఈ విషయంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో, ప్రైవేట్‌కు మారిన, ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధపడిన ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లోనే అత్యధిక మంది విద్యార్థులు ప్రస్తుతం కొనసాగుతున్నారు. ప్రభుత్వానికి అప్పగించిన విద్యాసంస్థలు పూర్తిగా మూతబడితే రాష్ట్రంలోని లక్షలాది విద్యార్థుల చదువు ప్రశ్నార్థకం అవుతుందన్న విషయం ప్రభుత్వం చర్చ చేయడం లేదు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో నామమాత్రపు ఫీజులు ఉంటాయి. ఎయిడెడ్‌ నుంచి ప్రైవేటుకు మారిన విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలుకు సిద్ధం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన వారంతా పేదవర్గాలకు చెందిన వారు కావడమే ఇందుకు కారణం. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ఎయిడెడ్‌ పాఠశాలలు కోర్టును ఆశ్రయించాయి. నిజానికి ఇంగ్లీష్‌ విూడియంతో ప్రజలకు విద్యను చేరువ చేస్తానని ప్రకటించిన సిఎం జగన్‌ మంచి నిర్ణయమే తీసుకున్నారు. కానీ అలాకాకుండా కేవలం కక్షసాధింపు లేదా, ఎయిడ్‌ ఆపాలన్న ధోరణి లో నిర్ణయం తీసుకోవడం మాత్రం మంచిది కాదు. తెలంగాణలో కూడా అనేక పాఠశాలలు మూతపడ్డాయి. టీచర్ల రిక్రూట్‌మెంట్‌ లేదు. ఇలాంటి ధోరణి సరికాదు. దీంతో విద్యారంగం కుదేలవుతుంది. సమాజ నిర్మాణాన్ని విద్య ప్రభావితం చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన విద్య కాలక్రమేణా లింగ, కుల, మత,
వర్ణ వివక్షతల కారణంగా విలవిల్లాడుతోంది. కొన్ని వర్గాలకే విద్య పరిమితం కావడం నేటికీ చూస్తున్నాం. అణగారిన వర్గాలకు నేటికీ ఉన్నత విద్య ఓ మిధ్యగా మారింది. ప్రతి కుటుంబంలో ఉన్న ఓ విద్యార్థి గుండెపై చేయి వేసుకుని తాను విద్యను అభ్యసించగలను అన్న భరోసాతో ఉండాలి. తల్లిదండ్రులకు కూడా పిల్లల విద్యపై చింత లేకుండా చేయాలి. విద్యకు సంబంధించి ఉన్నతంగా ఆలోచించాలి. ప్రభుత్వాలు ఈ రంగానికి అధికమొత్తంలో కేటాయింపులు చేయాలి. రకరకాల సంస్థలు పెట్టకుండా ఒకే గొడుగు కిందకు విద్యను తీసుకుని రావాలి. అనాదిగా సమాజం విద్యను, విద్య నేర్పే గురువును అత్యున్నత స్థానంలో నిలుపుతూ వచ్చింది. కానీ, నేడు సమాజానికి, ప్రభుత్వ విద్యకు మధ్య అంతరం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించడం లేదు. ఉన్నత వర్గాలు కూడా అలా చేయడం లేదు. అంటే ప్రభుత్వ విద్యకు విలువను మనమే కావాలని తక్కువ చేస్తున్నాం. విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను ఎవరూ ఆక్షేపించడం లేదు. అయితే బలోపేతం కావాలన్న సంకల్పంలో ప్రైవేట్‌ రంగం కూడా ఉండాలి. అంతమాత్రాన ప్రభుత్వ విద్య నీరసించరాదని గ్రహించాలి. విద్యతో మంచి సమాజం ఏర్పడే బదులు వ్యాపారధోరణిలో పయనించడమే మంచిది కాదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థల న్నిటినీ అణగదొక్కి..ప్రైవేట్‌ రంగానికే పెద్దపీట వేసినా అది అనకొండలా మన సమాజాన్ని మిగేస్తుందని పాలకులు గుర్తించాలి. ఒకప్పుడు విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ ఆవాస ప్రాంతంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఏకోపాధ్యా పాఠశాలలను ప్రారంభించారు. ఇదంతా కూడా గ్రామాలకు చదువును తీసుకుని వెళ్లాలన్న ఆలోచనతో చేసిందే. కానీ ఇప్పుడు ఆ ఉపాధ్యాయ పోస్టులనే హేతు బద్ధీకరణ పేరుతో రద్దు చేస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల మూసివేత వెనక ప్రభుత్వ కుట్ర దాగి ఉంది. ఇందులో కూడా ప్రైవేట్‌ సంస్థల ప్రోద్బలం స్పస్టంగా కనిపిస్తోంది. ప్రైవేటీకరణ ఉచ్చులో పడ్డ ప్రభుత్వాలు మెల్లగా విద్యారంగానికి కేటాయింపులు తగ్గిస్తూ వస్తున్నారు. విద్యారంగంలో రాజకీయ జోక్యం కూడా తగదు. ప్రభుత్వ విద్య తమ బాధ్యత కాదన్న ధోరణిలో ఉన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ విద్యారంగం ఎంతో పటిష్టంగా ఉండేది. అక్కడ చదివిన వారే ఉన్నతంగా ఎదిగారు. కానీ ఇంగ్లీష్‌ విూడియం స్కూళ్లు వచ్చాక ప్రభుత్వ విద్య నాసిరకంగా తయారయ్యింది. ఈ క్రమంలో విద్యారంగంపై పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఏకీకృతి విద్యా విధానం రావాలి. అందుకు మేధావుల సలహాలు తీసుకుని ముందుకు సాగాలి. కరోనా పుణ్యమా అని తల్లిదండ్రులు ఖర్చులు భరించలేక ఇటీవల మళ్లీ తమ పిల్లలను సర్కార్‌ స్కూళ్లకు పంపుతున్నారు. ఇది ఓమంచి పరిణామం. దీనిని అందిపుచ్చుకుని ప్రభుత్వాలు కూడా మళ్లీ విద్యారంగ పటిష్ఠతకు పెద్దపీట వేయాలి. బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ ప్రజలను చైతన్యం చేస్తే మునుపటిలాగా విద్యారంగం మళ్లీ గాడిన పడగలదు.