విద్యార్థులను నట్టేట ముంచిన కెసిఆర్‌

సకాలంలో రియంబర్స్‌మెంట్‌ ఇచ్చిన దాఖలాలు ఏవీ

కరీంనగర్‌ డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం

కరీంనగర్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వ బోధన, ఉపకార వేతన బకాయిల కోసం విద్యార్థులు నానాపాట్లు పడ్డారని కరీంనగర్‌ డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం అన్నారు. ఏ విద్యార్థిని అడిగినా ఈ విషయం చెబుతారని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో

ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. దళితబస్తీ కింద పట్టాలు ఇచ్చి భూములు చూపించడంలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆయన విమర్శించారు. ధనిక రాష్ట్రంతో పాటు మిగులు బడ్జెట్‌తో అధికారపగ్గాలు చేపట్టిన కేసీఆర్‌ పాలనలో అప్పుల చిట్టా పెరిగిందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెబుతున్నా… పట్టించుకోకుండా ,ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తూ విచ్చలవిడిగా నిధులు ఖర్చుచేసి ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా వారిని పట్టించుకోలేదన్నారు. ఎన్నికల హయాంలో ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీని సకాలంలో పూర్తి చేయలేదని వాపోయారు. విలాసాలు, పండగలు, పబ్బాలకు ఉదారంగా నిధులు ఖర్చుచేస్తూ రాష్ట్ర ఆదాయానికి గండికొట్టడం వల్ల్నే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుందని అన్నారు. కేసీఆర్‌ ప్రజల సంక్షేమంపై, రైతుల ఆత్మహత్యలపై ఏనాడు చర్చించలేదని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌కు మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.