విద్యార్థులపై దూసుకెళ్లిన లారీ… ఒకరు మృతి
విజయవాడ, జూలై 19 : నగర శివార్లలోని ఎనికేపాడు వద్ద విద్యార్థులపై వాహనం దూసుకుపోవడంతో ఒకరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అక్కడి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కొందరు గురువారం ఉదయం కళాశాలకు వెళ్తుండగా వారిపైకి అదుపుతప్పిన లారీ దూసుకొచ్చింది. విద్యార్థులు దానిని గమనించి తప్పుకునేలోగానే కొందరు దానికింద పడ్డారు. రోడ్డుపై పడిపోయిన మృణాళిని అనే ఇంజనీరింగ్ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో ఐసియులో చేర్చారు. కాగా మృతి చెందిన మృణాళిని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేలా పోలీసులు కృషి చేయాలంటూ మృతదేహంతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన వాహన యజమానిని గుర్తించి నష్టపరిహారం ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఇదిలా ఉండగా జగ్గయ్యపేట సమీపంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును షేర్‌మహ్మద్‌పేట వద్ద లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.