విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి

– ఉపాధ్యాయులకు అన్ని విధాల అండగా ఉంటాం
– ఒక్కో ఇంటి నుంచి ఒక్కో సింధు రావాలి
– సింధు ఏ టోర్నీకి వెళ్లినా స్వర్ణంతో తిరిగి రావాలి
– అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ ఉంటే… ఏపీలో ఇన్నోవేషన్‌ వ్యాలీ ఉంటుంది
– ప్రపంచంలో ఎవ్వరూ వినియోగించని టెక్నాలజీని ఏపీ వాడుతుంది
– కేంద్రం ఏ విషయంలోనూ ఏపీకి సహకరించడం లేదు
– అలా అని ఖాళీగా కుర్చుంటే రాష్ట్రం అభివృద్ధి జరగదు
– అప్పులు చేయడాన్ని కొందరు తప్పుడు పడుతున్నారు
– అలా చేయకుంటే రాజధాని నిర్మాణం చేయలేం
– బాధ్యతగా ఉండాల్సివారూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న సీఎం
గుంటూరు, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : విద్యార్థుల్లో దాగియున్న ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంటుందని, ఆ మేరకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తాను ఆసియా క్రీడల్లో సాధించిన రజత పతకాన్ని ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సందర్భంగా సింధుపై ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘పీవీ సింధు 23 ఏళ్లకే బ్యాడ్మింటన్‌లో సంచనాలు సృష్టిస్తోందన్నారు. జీవితంలో శ్రమ లేకుండా ఏదీ సాధించలేమని, తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించడం, అహర్నిశలు కష్టపడటంతోనే సింధు ఈ స్థాయికి చేరుకుందన్నారు. ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన సింధును ఎలా గౌరవించాలో కేబినెట్‌లో నిర్ణయిస్తామన్నారు. మనందరి ఆశీస్సులతో సింధు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇకపై ఆడే ప్రతి టోర్నీలోనూ సింధు స్వర్ణ పతకంతో తిరిగిరావాలని కోరారు. బ్యాడ్మింటన్‌ను కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారంటే అందుకు
ఆమే కారణమని, సింధు లాంటి విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించి తీర్చిదిద్దాలని సూచించారు. ఒక్కో ఇంటి నుంచి ఒక్కో సింధు వచ్చేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలి అని  చంద్రబాబు అన్నారు. ఏపీలో 8వేల మంది రెగ్యులర్‌, 10వేల మంది కాంట్రాక్ట్‌ టీచర్లను భర్తీ చేశామని, అన్ని స్కూళ్లలో నరేగా నిధులతో ప్రహరీలు నిర్మించామని తెలిపారు. అన్ని స్కూళ్లకు సొంత భవనాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విద్యలో అసమానతలు లేకుండా అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని బాబు పేర్కొన్నారు. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ ఉంటే…ఏపీలో ఇన్నోవేషన్‌ వ్యాలీ ఉంటుందని అన్నారు. ఏపీ నాలెడ్జ్‌ హబ్‌గా మారాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఎవ్వరూ వినియోగించని టెక్నాలజీని ఏపీ వాడుతోందన్నారు. కేంద్రం ఏ విషయంలోనూ ఏపీకి సహకరించడంలేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నిధులు లేవని ఖాళీగా కూర్చుంటే రాష్ట్ర అభివృద్ధి జరగదన్నారు. అప్పులు చేయకపోతే రాజధాని నిర్మాణాన్ని చేపట్టలేమని, అయితే అప్పులు చేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా తల్లిదండ్రులే నా మొదటి గురువులు – పి.వి. సింధు
‘నా తల్లిదండ్రులే నా మొదటి గురువులు’ అని టెన్నీస్‌  క్రీడాకారిణి పి.వి.సింధు పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహించిన గురుపూజోత్సవం వేడుకల్లో సింధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒలింపిక్స్‌ పతకం సాధించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన ప్రశంసలు మరిచిపోలేనివని.. ఆయన అందించిన సహకారంతోనే ఆటలో మెరుగ్గా ఆడుతున్నానన్నారు. తల్లిదండ్రులే తనకు తొలి గురువులని.. చదువుతో పాటు బ్యాడ్మింటన్‌లోనూ తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక గురువుల పాత్ర ఎంతో ఉందన్నారు. వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తన కెరీర్‌ తొలి దశలోనే ఉందని.. అందరి సహకారంతో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటానని సింధు ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యాశాఖపై సీఎం ప్రత్యేక శ్రద్ద – విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు
విద్యాశాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని, లోటు బడ్జెట్‌లోనూ సీఎం విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించారని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు అన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్య విద్యార్థి అని గంటా అన్నారు. లోటు బడ్జెట్‌లో కూడా విద్యకు అధిక నిధులు కేటాయించారని, విద్యా శాఖపై సీఎం ప్రత్యేక శ్రద్ద ఉందని తెలిపారు. ఎంతో సీనియర్‌ రాజకీయ వేత్త అయినప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోవడంపై సీఎం ఆసక్తి చూపుతారని మంత్రి పేర్కొన్నారు. ‘ఎంతటి ఉన్నత స్దానంలో ఉన్న మనం గౌరవం ఇచ్చే వ్యక్తి గురవు మాత్రమే’ అని  గంటా పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని, పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాద్యాయులు కృషి చేయాలని మంత్రి గంటా తెలిపారు. ఉపాధ్యాయులను ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏపిని నాలెడ్జ్‌ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం సంకల్పంతో ఉందని తెలిపారు. టెక్నాలజీ ఎంత పెరిగినా గురువు స్దానం మారదని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ముఖ్యమంత్రి పురస్కారాలు ప్రదానం చేశారు.

తాజావార్తలు