విద్యుత్తుకోతలకు నిరసనగా రాస్తారోకో
రేగొండ: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తుకోతలు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ తెరాస ఆధ్వర్యంలో శనివారం నాయకులు రాస్తారోకో చేశారు. ముందుగా నాయకులు రావుళ్లపల్లి బన్ స్టేజ్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెరాస భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సిరికొండ ముధు సూదనాచారి తెలంగాణకు విద్యుత్తును కేటాయించటంలో సీమాంధ్ర పాలకులు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రైతులకు 7గంటల విద్యుత్తును ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెరాస మండల కమిటీ అధ్యక్షుడు పున్నం రవి, జిల్లా మండల నాయకులు ఉమేష్, బిక్షపతి, లింగరెడ్డి , సుమన్ రెడ్డిలతో పాటు దాదాపు వందమంది కార్యకర్తలు పాల్గొన్నారు.