విద్యుత్‌భారం పేదలపై పడకుండా చూస్తాం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌
హైదరాబాద్‌, మార్చి 31 (జనంసాక్షి) :
విద్యుత్‌ చార్జీల పెంపుభారం పేదలపై పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపుపై స్వపక్షం నుంచే వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో చార్జీల భారాన్ని పేదలపై పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆదివారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మొత్తం పెంపుభారంలో రూ.6,173 కోట్లు ప్రభుత్వం భరించేలా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సిఫార్సులను తానింకా చూడలేదన్నారు. ఈనెల 4, 5 తేదీల్లో సమావేశాలు నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే సీఎం నిర్ణయం వెనుక అధిష్టానం ఒత్తిడి కూడా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ఏడాది ఇష్టంవచ్చినట్లు చార్జీలు పెంచితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని పీసీసీ పక్షాన అధిష్టానానికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా కాంగ్రెస్‌ పార్టీకి విపత్కర పరిస్థితులు తలెత్తబోతున్నాయని ఆయన వ్యతిరేకులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. పెద్దల ఒత్తిడి కారణంగానే చార్జీల పెంపుపై సీఎం కొంత వెనుక్కుతగ్గినట్లు తెలిసింది.