విద్యుత్‌ చార్జీలు పెంచమని

ఎప్పుడూ చెప్పలేదు : బొత్స
హైదరాబాద్‌, మార్చి 31 (జనంసాక్షి) :
విద్యుత్‌ చార్జీలు పెంచమని ఎప్పుడూ చెప్పలేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్సనారాయణ అన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అయినా ప్రజలపై భారం పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే చార్జీలు పెంచాల్సి వచ్చిందని అన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపువల్ల సామాన్యులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కాంగ్రెస్‌ పార్టీ తరఫున కోరుతానని చెప్పారు. ఛార్జీల పెంపు విషయంలోవెనక్కి తగ్గుతారా అని ప్రశ్నించగా, ఆ ప్రశ్న ఉత్పన్నం కాకూడదు, పెంచిన విద్యుత్‌ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా చూడాలన్నదే తమ అభిమతమని చెప్పారు. విద్యుత్‌ రంగంలో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. విద్యుత్‌ డిమాండ్‌కు ఉత్పత్తి మధ్య 62 మిలియన్‌ యూనిట్ల వ్యత్యాసం ఉందని తెలిపారు. పలు కారణాలవల్ల ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. అయినప్పటికీ ప్రజలకు, రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఎక్కువ రేటు అయినా విద్యుత్‌ కొనుగోలుచేసి ప్రభుత్వం సరఫరా చేస్తోందని చెప్పారు. రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటను ఎప్పుడూ జవదాటదన్నారు. తమకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం అప్పగించారని వారి నమ్మకాన్ని పార్టీ ఎప్పుడూ వమ్ము చేయబోదన్నారు. అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడంవల్ల ప్రజాధనమే దుర్వినియోగం అవుతుంది కదా అని అన్నారు. సాధ్యమైనంత మేరకు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా విద్యుత్‌ సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. 24 లక్షల మందికి స్కాలర్‌షిప్‌లు, రైతులకు వడ్డీలేని రుణాలు, రైతులకు అదనంగా బోనస్‌ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. ప్రజలపై భారం పడకూడదనే పార్టీ లక్ష్యమన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పార్టీ తరఫున కోరుతున్నామని చెబుతున్నారు. చార్జీలు పెంచబోమని ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఎక్కడా చెప్పలేదన్నారు. 2009లో ఆ విషయం ప్రస్తావించలేదన్నారు. విపక్షాలు రాజకీయ లబ్ధికోసమే విద్యుత్‌ సమస్యను వాడుకుంటున్నాయని బొత్స ధ్వజమెత్తారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తున్నామని, పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. విపక్షాలు ప్రచారం చేస్తున్న అవాస్తవాలను గమనించాలని ప్రజలను కోరారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పార్టీ వేరు ప్రభుత్వం వేరు కాదని రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. అందుకే ప్రజలకు మేలు కలిగేలా భారం పడకుండా చూడాలని పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.