విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్ల కొరత

అనంతపురం,జూన్‌27(జ‌నం సాక్షి): అవసరమైన విద్యుత్‌ సిబ్బంది లేకపోవడంతో గ్రావిూణ ప్రాంతాల్లో రైతులు, గ్రామస్తులు కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ ఫీజు పోటే వేసేవారు లేకపోవడంతో పెనుగాలులు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా విద్యుత్‌ సరఫరా ఆగిపోయన సందర్భంలో పునరుద్ధరణకు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వివిధ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది కొరత ఉండడంతో అటు ఆ శాఖ అధికారులు ఇటు వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా లైన్‌మెన్ల కొరత వేధిస్తోంది. కొన్ని సందర్భాల్లో రైతులే ఫీజులు వేసేందుకు యత్నించి మృత్యుపాలైన సంఘటనలు లేకపోలేదు. సదరన్‌ వపర్‌ డిస్టిబ్యూష్రన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్పీడీసీఎల్‌) అనంత విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలో అనంతపురం, హిందూపురం, కదిరి, గుత్తి, కళ్యాణదుర్గం సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ఈ రెండు విభాగాల పరిధిలో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్‌ఇంజనీర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది. జిల్లా విద్యుత్‌ శాఖలో మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. లైన్‌మన్లతో పాటు అసిస్టెంట్‌ ఇంజనీర్లు, సబ్‌ఇంజనీర్లు, సీనియర్‌, లైన్‌మన్‌ డ్రైవర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఆఫీస్‌ సబార్టినేట్లు విభాగాల్లో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నియామకాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని ఆ శాఖ అధికావర్గాలు చెబుతున్నాయి.