విద్యుత్ షాక్..ముగ్గురికి గాయాలు
తిరుపతి, జూలై 21 : చిత్తూరు పట్టణానికి సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సంభవించిన విద్యుత్ షాక్‌తో తొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పట్టణానికి సమీపంలోని కొంగారెడ్డిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నాం భోజనం అనంతరం కొందరు విద్యార్థులు విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. కొంతకాలంగా మంచినీరు పాఠశాలకు అందకపోవడంతో పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలోని సంపు నుంచి మంచినీరును తీసుకు రావడం జరుగుతోంది. యథావిధిగా శనివారం మధ్యాహ్నం విద్యార్థులు సంపు నుంచి నీరు తీస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌పై నీళ్లు పడ్డాయి. దీంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో ముగ్గురు విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. వారిని కాపాడేందుకు వచ్చిన మరో విద్యార్థి కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఈ దృశ్యాన్ని చూసిన అధ్యాపకులు 108కి సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దినేష్, పవన్, నందిని విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తహసీల్దారు శివకుమార్, మునిసిపల్ కమిషనర్ వైఎస్‌ఎస్ వర్మ, పట్టణ ఎస్‌ఐ నిత్యబాబు దర్యాప్తు చేస్తున్నారు. జెసి వినయ్‌చంద్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగితెలుసుకున్నారు.