విద్యుత్‌ సమస్య వాస్తవమే

కేంద్ర ప్రభుత్వ విధానాలలో మార్పు రావాలి
రాష్ట్ర ప్రజలకు పిసిసి అధ్యక్షుడు బొత్స క్షమాపణ
హైదరాబాద్‌, ఆగస్టు 6: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై వస్తున్న వార్తలు వాస్తవమేనని అంగీకరించారు. ప్రకృతి అనుకూలించకపోవడంతో వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో, గ్యాస్‌ ఉత్పత్తి తగ్గిందని అన్నారు. కెజీ బేసిన్‌లో గ్యాస్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య తీవ్రరూపం దాల్చిందని ఆయన అంగీకరించారు. ముఖ్యంగా గ్యాస్‌ కేటాయింపులపై కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యకు అన్ని పార్టీలు బాధ్యత వహించాలని బొత్స అన్నారు. ధబోల్‌ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ప్రభుత్వరంగ సంస్థ అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ప్రైవేటు రంగంలోనిదంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే, అధికార పార్టీ అధ్యక్షుడిగా తాను ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నామని అన్నారు. గ్యాస్‌ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. గ్యాస్‌ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వాల లోపాల వల్లనే విద్యుత్‌ సమస్యను ఎదుర్కొంటున్నామని అన్నారు. 2008కి ముందు అప్పటి ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా ఆలోచించి వుంటే ఈ సమస్య తలెత్తేది కాదని బొత్స అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఏర్పడినందున జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోయాయని, ఇది కూడా కొంత మేర విద్యుత్‌ సమస్యకు కారణమని అన్నారు.